పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వివిధ దశలను దాటుకుంటూ మనిషి జీవితం సాగుతుంది. చదువులు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్ తదితర దశలను దాటుతూ రావాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా మన ఆర్థిక ప్రణాళిక ఉంటే ఇబ్బందులు తగ్గించుకోవచ్చు.
ప్రయాణాలు, వాహనం కొనుగోళ్లు సంవత్సరం లోపు ఉండవచ్చు. ఇలాంటి వాటిని స్పల్పకాల లక్ష్యాలు అంటారు. దీర్ఘకాలంలో రిటైర్మెంట్, పిల్లల చదువులు, పెళ్లిలు తదితర లక్ష్యాలు ఉండవచ్చు. ఇలాంటి వాటిని దీర్ఘకాల లక్ష్యాలు అంటారు. స్వల్ప, దీర్ఘ కాలంలో పెట్టుబడులకు పలు సాధనాలు అందుబాటులోఉన్నాయి.
స్వల్పకాల సాధనాలు..
ఏడాదిలో తీర్చుకోవాల్సిన లక్ష్యాలను స్వల్పకాల లక్ష్యాలుగా పరిగణించవచ్చు. 3 నుంచి 5 ఏళ్ల వ్యవధి వరకు ఉన్న వాటిని కూడా స్వల్పకాల లక్ష్యాలుగానే భావిస్తారు. వీటికి సంబంధించి పెట్టుబడుల్లో ద్రవ్య లభ్యత ఎక్కువగా ఉంటుంది. అంటే వీటిని నగదు రూపంలోకి త్వరగా మార్చుకోవచ్చన్నమాట.
రికరింగ్ డిపాజిట్లు..
3 నెలల వ్యవధి నుంచి 10 సంవత్సరాల వరకు రికరింగ్ డిపాజిట్లను ప్రారంభించవచ్చు. సాధారణంగా వీటికి ఒక నెల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఒక నెల లోపు తీసుకున్నట్లయితే అసలు మాత్రమే పొందవచ్చు. ప్రస్తుతం 12 నెలలు, అంతకంటే ఎక్కువ కాలం ఉంచిన డిపాజిట్లపై 6.5 శాతం రాబడి లభిస్తుంది.
డెట్ పెట్టుబడులు..
91 కంటే తక్కువ గడువుతో పెట్టుబడులను లిక్విడ్ ఫండ్లు అంటారు. 3 నెలల నుంచి 6 నెలల వ్యవధి పెట్టుబడులను అల్ట్రా షార్ట్‌టర్మ్ ఫండ్ అంటారు. ఆరు నెలల నుంచి 12 నెలల వాటిని లో డ్యూరేషన్ ఫండ్స్ అని అంటారు. వీటిలోనూ లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. 7 శాతం నుంచి 9 శాతం రాబడి ఇవి అందిస్తాయి.
బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు..
ఇవి సురక్షితమైన పెట్టుబడి. వీటిపై నిర్ణీత రాబడి లభిస్తుంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధితో ఈ డిపాజిట్ చేయవచ్చు. 7.50 శాతం వరకు ఇవి రాబడిని అందిస్తున్నాయి.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లు..
ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాల వ్యవధితో ఈ ఖాతాను తీసుకోవచ్చు. 6 నెలల ముందు ప్రీమెచ్యూర్డ్ విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఇవి 5.5 శాతం నుంచి 6.7 వరకు రాబడిని అందిస్తున్నాయి.
మనీ మార్కెట్ ఖాతాలు..
వీటినే మనీ మార్కెట్ అకౌంట్స్ అని కూడా అంటారు. ఇవి స్వల్ప కాల అవసరాలకు మంచి పెట్టుబడులు. 13 నెలల కంటే తక్కువ గడువుతో ఈ ఖాతాను తీసుకోవచ్చు. లాక్ ఇన్ పీరియడ్ ఉండదు. వీటిపై రాబడి గ్యారంటీ ఉండదు. ప్రస్తుతం 7 శాతం రాబడిని అందిస్తున్నాయి.