వాట్సాప్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ సేవలు
కరోనా ప్రభావంతో అన్ని రంగాలు గడ్డు ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. బ్యాంకింగ్ ఇందుకు మినహాయింపేమీ కాదు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ వల్ల ఇంటినుంచే వాట్సాప్‌తో బ్యాంకింగ్ సేవలు పొందే సౌలభ్యాన్ని తీసుకొచ్చింది ఐసీఐసీఐ బ్యాంకు.
వాట్సాప్‌తో బ్యాంకింగ్ సేవలు పొందే సౌలభ్యాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తుండటంతో ఇంటినుంచే బ్యాంకింగ్ అవసరాలు పూర్తిచేసే విధంగా ఈ సేవలను రూపొందించింది. వాట్సాప్ 'ఐసీఐసీఐస్టాక్' సేవలను రిటైల్, బిజినెస్ ఖాతాదార్లు పొందొచ్చని, ఇందులో దాదాపు 500 రకాల సేవలు లభిస్తాయని బ్యాంక్ తెలిపింది. సేవింగ్స్ ఖాతా నిల్వ, గత 3 లాావాదేవీలు, క్రెడిట్ కార్డు పరిమితి, తక్షణ రుణం, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు బ్లాక్, అన్ బ్లాక్ వంటి సేవలనూ పొందొచ్చు.
- ఇలా చేయాలి... ఖాతాదారుడు ఐసీఐసీఐ బ్యాంక్ ధ్రువీకరించిన వాట్సాప్ ప్రొఫైల్ నంబరు 9324953001ను మొబైల్ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత బ్యాంక్‌లో నమోదైన ఖాతాదారు మొబైల్ నంబరు నుంచి ఈ నంబరుకు 'హాయ్' అని మెసేజ్ పంపాలి.
- వెంటనే బ్యాంక్ సేవల వివరాలతో కూడిన జాబితాను పంపిస్తుంది.
- సేవల జాబితాలో మనకు అవసరమైన సేవకు సంబంధించి కీవర్డ్‌ను టైప్ చేయాలి. ఉదాహరణకు(బ్యాలెన్స్), (బ్లాక్);
- అనంతరం సేవలను పూర్తి చేయొచ్చు.