తెలంగాణ

telangana

ETV Bharat / business

హ్యుందాయ్ 'కశ్మీర్​ పోస్ట్'​పై కేంద్రం సీరియస్- దక్షిణ కొరియా సారీ!

Hyundai apology: హ్యుందాయ్ సంస్థ పాకిస్థాన్ విభాగం చేసిన వివాదాస్పద పోస్ట్​పై కేంద్రం సీరియస్ అయింది. దీనిపై దక్షిణ కొరియాలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్నిసంప్రదించి.. వివరణ కోరింది. ఆ దేశ రాయబారికి సమన్లు సైతం జారీ చేసింది. కాగా.. దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి ఈ అంశంపై విచారం వ్యక్తం చేశారు.

Hyundai apology
Hyundai apology

By

Published : Feb 8, 2022, 12:55 PM IST

Updated : Feb 8, 2022, 4:41 PM IST

Hyundai apology: కశ్మీర్ అంశంపై ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ చేసిన సోషల్ మీడియా పోస్టులను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. హ్యుందాయ్ పాకిస్థాన్​ శాఖ కశ్మీర్ సంఘీభావ దినానికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంపై కన్నెర్రజేసింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం దక్షిణ కొరియాలో ఉన్న నేపథ్యంలో.. ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. భారత ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేసిన పోస్టులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు దక్షిణ కొరియా రాయబారికి స్పష్టం చేసింది. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ తేల్చి చెప్పింది.

"హ్యుందాయ్ సంస్థ ఆదివారం సామాజిక మాధ్యమాల్లో (కశ్మీర్ అంశంపై) పోస్ట్ చేయగానే సియోల్​లోని భారత రాయబారి.. ఆ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించారు. దీనిపై వివరణ ఇవ్వాలని అడిగారు. సోమవారం భారత విదేశాంగ శాఖ.. దక్షిణ కొరియా రాయబారికి సమన్లు పంపింది."

-అరిందమ్ బాగ్చి, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి

ఈ విషయంపై దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఎయూ యోంగ్ విచారం వ్యక్తం చేశారని బాగ్చి తెలిపారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్​కు ఆయన ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు.

"మంగళవారం ఉదయం జైశంకర్​కు దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు. వివిధ అంశాలపై ఇరువురూ చర్చించారు. హ్యుందాయ్ అంశం సైతం చర్చకు వచ్చింది. హ్యుందాయ్ చేసిన పోస్టు వల్ల భారత ప్రభుత్వానికి, ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని యోంగ్ చెప్పారు. హ్యుందాయ్ సంస్థ కూడా దీనిపై వివరణ ఇచ్చింది. రాజకీయ, మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోమని తెలిపింది."

-అరిందమ్ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి

విదేశీ కంపెనీల పెట్టుబడులను భారత్ స్వాగతిస్తుందని, అయితే.. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై తప్పుదోవపట్టించేలా వ్యాఖ్యలు చేయకూడదని బాగ్చి స్పష్టం చేశారు.

'సారీ స్పష్టంగా ఉండాలి కదా!'

మరోవైపు, హ్యుందాయ్ సంస్థ చెప్పిన క్షమాపణలు మరింత స్పష్టంగా ఉండాల్సిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. తీవ్ర దుమారం రేపిన ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఆయన.. నిస్సంకోచంగా క్షమాణలు చెప్పాల్సిందని పేర్కొన్నారు.

ఏం జరిగిందంటే?

పాకిస్థాన్‌లో హ్యుందాయ్​ కంపెనీ సోషల్‌మీడియా ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్‌ నెటిన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 'కశ్మీర్‌ కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుందాం, స్వాతంత్ర్యం కోసం వారు చేస్తున్న పోరాటానికి అండగా నిలుద్దాం' అంటూ పేర్కొంది. పాకిస్థాన్‌ ఏటా ఫిబ్రవరి 5న నిర్వహించే కశ్మీర్‌ సంస్మరణ దినం సందర్భంగా ఈ పోస్ట్‌ కనిపించడం వివాదానికి కారణమైంది. దీంతో నెటిజన్లు హ్యుందాయ్‌ కార్లను బహిష్కరించాలంటూ సామాజిక మాధ్యమాల్లో 'బాయ్‌కాట్‌ హ్యుందాయ్‌' అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ చేశారు. కశ్మీర్‌ వేర్పాటువాదులకు మద్దతిచ్చేలా ఇది ఉందంటూ భారత్‌లో దీనిపై దుమారం రేగింది. కాసేపటికే సంస్థ పోస్ట్‌ తొలగించినప్పటికీ.. సంబంధిత స్క్రీన్‌షాట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో భారత్‌లో కంపెనీపై వ్యతిరేకత మొదలైంది. ఆ కంపెనీ పాక్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు.

సోషల్‌ మీడియాలో వస్తున్న వ్యతిరేకతను గమనించిన హ్యుందాయ్‌ నష్ట నివారణ చర్యలకు దిగింది. 25 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలను కొనసాగిస్తున్నామని, జాతీయవాదానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఓ ప్రకటనను విడుదల చేసింది. సున్నితమైన అంశాల విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తామని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ వివరణ ఇచ్చింది. హ్యుందాయ్‌ బ్రాండ్‌కు భారత్‌ రెండో ఇల్లని తెలిపింది.

హ్యుందాయ్‌ ఇచ్చిన వివరణ పట్ల శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అసంతృప్తి వ్యక్తంచేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు భాజపా సభ్యుడైన డాక్టర్‌ విజయ్‌ చౌతాయ్‌వాలే సైతం హ్యుందాయ్‌ ప్రకటనపై మండిపడ్డారు. పాకిస్థాన్‌ హ్యుందాయ్‌ పోస్టుకు కంపెనీ మద్దతుగా నిలుస్తోందా? గ్లోబల్‌గా భారత్‌ విషయంలో మీ వైఖరి ఏమిటి? అంటూ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:Donate Kart: ఫోర్బ్స్ జాబితో చోటు దక్కించుకున్న హైదరాబాద్​ అంకుర సంస్థ

Last Updated : Feb 8, 2022, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details