తెలంగాణ

telangana

ETV Bharat / business

'డేటా సెంటర్ల' కేంద్రంగా హైదరాబాద్‌ - హైదారాబాద్​లో మరో అంతర్జాతీయ సంస్థ క్లౌడ్ సెంటర్​

హైదరాబాద్​లో డేటా సెంటర్ల సామర్థ్యం 2023 నాటికి మూడు రెట్లు పెరుగుతుందని రియల్‌ ఎస్టేట్‌ కన్సెల్టెన్సీ సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ వెల్లడించింది. మిగతా ప్రధాన నగరాల్లోనూ డేటా సెంటర్లు పెరుగుతున్నా.. కొత్తగా ఏర్పడే వాటికి మాత్రం హైదారాబాద్​, ఎన్​సీఆర్​ దిల్లీలు కేంద్రంగా ఎదుగుతాయని వివరించింది.

Huge demand for data centres in Hyderabad
హైదరాబాద్​లో డేటా సెంటర్లకు భారీ డిమాండ్​

By

Published : Jun 17, 2021, 7:13 AM IST

Updated : Jun 17, 2021, 9:20 AM IST

డేటా సెంటర్లను హైదరాబాద్‌ నగరం పెద్దఎత్తున ఆకర్షిస్తోందని రియల్‌ ఎస్టేట్‌ కన్సెల్టెన్సీ సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ వెల్లడించింది. దీనివల్ల హైదరాబాద్‌లో డేటా సెంటర్ల సామర్థ్యం 2023 నాటికి మూడు రెట్లు పెరగనుందని, తత్ఫలితంగా ఇక్కడ డేటా పరిశ్రమ సామర్థ్యం 96 మెగావాట్లకు పెరుగుతుందని '2020 ఇండియా డేటా సెంటర్‌ మార్కెట్‌ అప్‌డేట్‌' అనే నివేదికలో జేఎల్‌ఎల్‌ విశ్లేషించింది. స్థిరాస్తి మార్కెట్‌ స్థితిగతులు, ఐటీ కంపెనీల విస్తరణ, సానుకూల ప్రభుత్వ విధానాలు ఇందుకు దోహదపడుతున్నట్లు పేర్కొంది. కో-లొకేషన్‌ డేటా సెంటర్‌ సామర్థ్యంలో హైదరాబాద్‌ వాటా ప్రస్తుతం 7% ఉండగా, 2023 నాటికి ఇది 10 శాతానికి పెరుగుతుందని స్పష్టం చేసింది. ప్రపంచ స్థాయి క్లౌడ్‌ సేవల సంస్థ త్వరలో ఒక పెద్ద డేటా సెంటర్‌ ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుందని వివరించింది.

1007 మెగావాట్లకు సామర్థ్యం

మనదేశంలో 2019లో డేటా కేంద్రాల సామర్థ్యం 350 మెగావాట్లు కాగా, ఇది 2020 నాటికి 447 మెగావాట్లకు పెరిగింది. ఇది ఇంకా పెరిగి 2023 నాటికి 1,007 మెగావాట్లకు చేరుతుందని జేఎల్‌ఎల్‌- డేటా సెంటర్‌ అడ్వైజరీ (ఇండియా) విభాగం అధిపతి రచిత్‌ మోహన్‌ అభిప్రాయపడ్డారు. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే డేటాకు విపరీతమైన గిరాకీ వస్తుందని, క్లౌడ్‌ వినియోగం భారీగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మనదేశంలో డేటా కేంద్రాల పరిశ్రమకు వచ్చే మూడేళ్లలో 60 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలం అవసరమని వివరించారు. దీనికి అనుగుణంగా 3.7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని పరిశ్రమ ఆకర్షిస్తుందని తెలిపారు.

ముంబయి, చెన్నై నగరాల్లోనూ డేటా పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతుందని ఈ నివేదిక పేర్కొంది. కానీ కొత్తగా డేటా సెంటర్ల కేంద్రస్థానాలుగా హైదరాబాద్‌, ఎన్‌సీఆర్‌ దిల్లీ ఎదుగుతాయని వివరించింది.

ఇదిలా ఉంటే జపాన్‌ సంస్థలు ఎన్‌టీటీ గ్లోబల్‌ డేటా సెంటర్స్‌, టోక్యో సెంచురీ సంయుక్త సంస్థ ద్వారా భారత్‌లో డేటా సెంటర్‌ వ్యాపారం నిర్వహించనున్నాయి.

ఇదీ చదవండి:30,00,000 బీపీఓ ఉద్యోగాల గల్లంతు!

Last Updated : Jun 17, 2021, 9:20 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details