తెలంగాణ

telangana

ETV Bharat / business

హనీమూన్ చెడగొట్టినందుకు భారీ జరిమానా! - హనీమూన్

థాయ్​ ఎయిర్​వేస్​కు వింత అనుభవం ఎదురైంది. ఓ కొత్త జంట హనీమూన్​ ట్రిప్​కు ఆటంకం కలించినందుకు గాను రూ.3.85 లక్షల జరిమానా విధించింది మహారాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్​. తీర్పు ప్రతి అందిన తర్వాత స్పందిస్తామని తెలిపారు ఎయిర్​వేస్​ తరఫు న్యాయవాది కె.జాగోష్‌.

హనీమూన్​​కు ఆటంకం కలిగిందని ఎయిర్​వేస్​కు భారీ జరిమానా!

By

Published : Sep 21, 2019, 10:58 AM IST

Updated : Oct 1, 2019, 10:34 AM IST

ఓ కొత్త జంట హనీమూన్‌ ట్రిప్‌కు ఆటంకం కలిగించినందుకు గానూ థాయ్‌ ఎయిర్‌వేస్‌కు భారీ జరిమానా పడింది. న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌కు హనీమూన్‌కు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న జంటకు సమాచార అందించడంలో విఫలమైన ఎయిర్‌లైన్స్‌కు మహారాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ రూ.3.85లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

2013లో..

2013 డిసెంబర్‌ 19న ఓ జంట ముంబయి నుంచి బ్యాంకాక్‌ మీదుగా అక్లాండ్‌ వెళ్లేందుకు కావాల్సిన టికెట్లు బుక్‌ చేసుకుంది. వీసాతో పాటు ప్రయాణానికి అవసరమైన అన్ని పత్రాలూ సమకూర్చుకుంది. అయితే, వారు విమానాశ్రయం వద్దకు చేరుకోగానే వాళ్లకు ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది బ్యాంకాక్‌ వరకు ప్రయాణానికి బోర్డింగ్‌ పాస్‌లు ఇచ్చారు. కానీ బ్యాంకాక్‌ నుంచి అక్లాండ్‌ వెళ్లేందుకు బోర్డింగ్‌ పాస్‌లు ఇచ్చేందుకు నిరాకరించారు. బోర్డింగ్‌ పాస్‌లు ఎందుకు ఇవ్వడం లేదో సరైన కారణాలు కూడా చెప్పలేదని ఆరోపిస్తూ ఆ దంపతులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకొని ఇంటిముఖం పట్టారు.

నాట్​ ఓకే టు బోర్డ్​ సందేశంతో...

అనంతరం సంబంధిత ఎయిర్‌లైన్స్‌పై కేసు పెట్టారు దంపతులు. న్యూజిలాండ్‌ ఇమ్మిగ్రేషన్‌ నుంచి మహిళా ప్రయాణికుల కోసం తమ వ్యవస్థలో ‘నాట్‌ ఓకే టు బోర్డ్‌’ అనే సందేశం తమకు వచ్చిందని ఎయిర్‌లైన్స్‌ వారికి వివరించింది. అందువల్లే బ్యాంకాక్‌ నుంచి అక్లాండ్‌ వరకు ఈ దంపతులకు బోర్డింగ్‌ పాస్‌లను జారీ చేయలేదని స్పష్టంచేసింది. మహిళ తిరుగు ప్రయాణం టిక్కెట్‌ లేదని.. ఒక వైపు ప్రయాణానికే టికెట్‌ ఉన్నందువల్లే ఇలా జరిగిందనే విషయం ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది.

విజ్ఞప్తి తిరస్కరణ..

ఆ జంట తొలుత 2014లో జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. బ్యాంకాక్‌ నుంచి అక్లాండ్‌ ప్రయాణానికి ఫలానా ఆటంకం ఉందని ముందుగానే తమకు సమాచారం ఇస్తే సరిదిద్దుకొనేవాళ్లమని వారు వాదించారు. 2017లో వారి విజ్ఞప్తి తిరస్కారానికి గురయింది. 2018లో రాష్ట్ర వినియోగదారులు వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు.

సమాచారం ఇవ్వనందుకే..

ముంబయి నుంచి క్లాండ్‌ ప్రయాణానికి ఏవైనా ఇబ్బందులు ఉంటే ముందే చెప్పాల్సిందని.. అలా కాకుండా టికెట్లను కొనుక్కొని విమానాశ్రయానికి చేరుకొనే సమయానికి సరైన సమాధానం ఇవ్వకపోవడం సరికాదని కమిషన్‌ తెలిపింది. ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే వాళ్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఉండేవాళ్లు కదా అని తెలిపింది. ఆ దంపతుల హనీమూన్‌ ట్రిప్‌ను చెడగొట్టినందుకు గాను థాయ్ ఎయిర్‌లైన్స్‌ సంస్థ వారికి రూ.2.14లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. వాటితో పాటు టిక్కెట్ల మొత్తం రూ.46,532, ఇన్నాళ్లూ వారు అనుభవించిన మానసిక వేదనకు రూ.1లక్ష, వ్యాజ్యం దాఖలుకు అయిన ఖర్చుల నిమిత్తం రూ.25వేలు చొప్పున మొత్తం చెల్లించాలని ఆదేశించింది.

తీర్పు ప్రతి అందిన తర్వాతే..

దీనిపై థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ లిమిటెడ్‌ తరఫు న్యాయవాది కె.జాగోష్‌ స్పందించారు. తమకు ఇంకా తీర్పు ప్రతి అందలేదన్నారు. తీర్పు ప్రతి అందాకే దాన్ని అధ్యయనం చేసి ఆ తర్వాత ఏం చేయాలో ఓ నిర్ణయానికి రాగలమని ఆయన చెప్పారు.

ఇదీ చూడండి: భారీగా తగ్గిన కండోమ్ విక్రయాలు- కారణం అదేనా?

Last Updated : Oct 1, 2019, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details