మహిళల జీవితం... ఎల్లప్పుడూ ఒడుదొడుకులు ఉండే రోలర్ కోస్టర్ ప్రయాణం లాంటిది. ఎందుకంటే.. వాళ్లు ఇంటి నుంచి ఆఫీస్ వరకు.. పెళ్లి నుంచి తల్లి అయ్యేవరకు అనేక సవాళ్లు ఎదుర్కొంటుంటారు. కానీ... ఎన్నో క్లిష్టమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ జీవిత ప్రయాణంలో తమ గురించి తాము మహిళలు ఆలోచించుకోవడం లేదని చాలా పరిశోధలు చెబుతున్నాయి.
ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల విషయానికొస్తే.. పురుషులతో కన్నా మహిళలు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు. ఎందుకంటే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు, తక్కువ సంపాదిస్తారు. వారు చేసే పని నుంచి అనేక అవసరాల కోసం విరామాలు తీసుకుంటారు. ఒంటరి మహిళల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.
వారికి వారే సాటి...
పొదుపు చేయడంలో కాస్త నిరాసక్తత చూపినా... ప్రారంభిస్తే మాత్రం మహిళలకు మహిళలే సాటి. ఓ నివేదిక ప్రకారం.. అదాయ వర్గాల్లో పురుషులతో పోలిస్తే.. మహిళలు 5 శాతం- 10 శాతం పొదుపులో ముందున్నట్లు తేలింది. అయితే పొదుపు చేసే మొత్తాలు మాత్రం పురుషులతో పోలిస్తే తక్కువగా ఉంటోంది. మహిళల్లో పొదుపు పట్ల పెరగాల్సిన అవగాహన, ఆవశ్యకతను ఈ విషయం తెలియచెబుతోంది.
మహిళలకు పొదుపునకు సంబంధించి నిపుణుల సలహాలు సూచనలు మీ కోసం....
'సిప్'పై దృష్టిసారించండి..
మహిళల్లో పొదుపు అలవాటు అనేది ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. ఒక సారి పాత రోజులు గుర్తు తెచ్చుకుంటే.. బేరమాడటం, అవసరమైన వాటిని మాత్రమే కొనడం, అనవసర ఖర్చులు తగ్గించుకోవడం వంటి పనులతో వీలైనంత ఎక్కువగా పొదుపు ఇంట్లోని మహిళలు చేసేవారు. దాన్ని అనుకరించేందుకు మీరూ ప్రయత్నించండి.
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో పొదుపు చేయడం ప్రారంభించండి. తక్కువ మొత్తాల్లో పెట్టుబడితో మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉన్న సాధానమే సిప్. రోజులు, నెలల వారీగా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు.
క్రమ శిక్షణతో పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్లు సిప్‌ను అందిస్తాయి. ఇవి 'రూపాయి కాస్ట్ యావరేజింగ్', 'పవర్ ఆఫ్ కౌంపౌండింగ్' పద్ధతిని అనుసరిస్తాయి. దీని ద్వారా దీర్ఘకాలంలో ఆకర్షణీయమైన ప్రతిఫలాలు అందుతాయి.
మహిళ్లలో స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఫిక్సెడ్ డిపాజిట్ల నుంచి మ్యూచువల్ ఫండ్లవైపు మొగ్గుచూపుతున్నారు.
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి..
ఫిక్సెడ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు అనేవి కేవలం చిన్న చిన్న అవసరాలు తీర్చుకునేందుకు మాత్రమే పనికొస్తాయి. మీ పొదుపుతో ఎక్కువ రిటర్నులు రావాలనుకుంటే.. రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి రిస్క్ తీసుకునే మహిళ్లలో మీరు ఉంటే స్టాక్ మార్కెట్ల గురించి తెలుసుకోండి.
స్టాక్ మార్కెట్ల ద్వారా సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే.. చాలా ఎక్కువ సంపాదించొచ్చు. మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు.. లిస్టెడ్ కంపెనీల గురించి తెలుసుకుని, నాణ్యమైన స్టాక్లను పెట్టుబడి కోసం ఎంపిక చేసుకోవడం మంచిది.
ఈఎల్ఎస్ఎస్..
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ పథకాలు (ఈఎల్ఎస్ఎస్).. ఉత్తమమైన పన్ను ఆదా మార్గాలు. వీటి ద్వారా ఎక్కువ రిటర్నులూ లభిస్తాయి. మ్యూచువల్ ఫండ్లు అందించే విభిన్నమైన ఉత్పత్తులే ఈఎల్ఎస్ఎస్. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు వస్తుంది. ఈఎల్ఎస్ఎస్ గత ఐదేళ్లలో 15 నుంచి 20 శాతం రిటర్నులు ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.