తెలంగాణ

telangana

ETV Bharat / business

'టొసిలిజుమ్యాబ్‌'తో కరోనా రోగులకు ప్రయోజనమెంత?

కరోనా రోగులకుకు ఇస్తున్న ఔషధాల్లో ఇటీవల 'టొసిలిజుమ్యాబ్‌' ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కొవిడ్‌-19 వ్యాధి సోకి, పరిస్థితి విషమించిన రోగులకు ఈ ఇంజక్షన్‌ ఇస్తే కోలుకునే అవకాశాలు ఉన్నట్లు భావించడం వల్ల దీని వినియోగం కూడా భారీగా పెరిగింది. మరి కరోనాను ఎదుర్కొనడంలో ఈ ఔషధం పనితీరు ఎలా ఉంది? కరోనా రోగులకు వినియోగంపై దీనిని తయారు చేసే స్విస్ కంపెనీ రోష్​ ఏమంటోంది?

How useful is the tocilizumab drug in the treatment of corona
కరోనా చికిత్సలో టొసిలిజుమ్యాబ్ ఉపయోగం

By

Published : Sep 6, 2020, 7:00 AM IST

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, జాయింట్‌ సెల్‌ ఆర్థరైటిస్‌ వ్యాధులు అదుపు చేయటానికి వినియోగించే ఔషధం 'టొసిలిజుమ్యాబ్‌'. స్విస్‌ కంపెనీ రోష్‌ దీన్ని తయారు చేస్తోంది. కొవిడ్‌-19 మహమ్మారి అనూహ్యంగా విస్తరించిన నేపథ్యంలో, ఈ వ్యాధి సోకిన వారికి ఉపశమనం కలిగించేందుకు అందుబాటులో ఉన్న పలు రకాలైన యాంటీ- వైరల్‌, యాంటీ-మలేరియా, యాంటీ-పారసైటిక్‌ మందులెన్నింటినో వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టొసిలిజుమ్యాబ్‌ ప్రాచుర్యంలోకి వచ్చింది. కొవిడ్‌-19 వ్యాధి సోకి, పరిస్థితి విషమించిన రోగులకు ఈ ఇంజక్షన్‌ ఇస్తే కోలుకునే అవకాశాలు ఉన్నట్లు భావించారు. మనదేశంలో సీడీఎస్‌సీఓ (సెంట్రల్‌ స్టాండర్డ్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌) కూడా 'ఆఫ్‌-లేబుల్‌' ఔషధంగా దీన్ని వినియోగించేందుకు వీలుకల్పించింది. దీనితో గిరాకీ ఎంతగానో పెరిగింది. ఇంతా చేస్తే... అసలు ఇది కొవిడ్‌-19 బాధితులకు ఉపశమనం కలిగించటం లేదని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎంతో ఖరీదైన ఈ సూదిమందు వల్ల రోగులు ఆర్థికంగా కుంగిపోవటం తప్పిస్తే, జబ్బు నుంచి కోలుకునే అవకాశాలు తక్కువగా వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయినా దీన్ని వినియోగించటం తగ్గలేదని తెలుస్తోంది.

అతి వినియోగం...

కొవిడ్‌-19 సోకిన రోగుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పక్షంలో కొద్ది రోజులకు తీవ్రమైన న్యూమోనియా సమస్య తలెత్తే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆ రోగికి ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స ఇవ్వాల్సి వస్తుంది. అటువంటి రోగులకు టొసిలిజుమ్యాబ్‌ ఇంజక్షన్‌ ఇస్తే... ఫలితం ఉంటుందనే ఉద్దేశంతో... దీన్ని వినియోగించటం మొదలైంది. నెమ్మదిగా దీనికి తీవ్రమైన కొరత ఏర్పడింది. ముంబయి నగరంతో సహా మహారాష్ట్రలోని ఎన్నో ప్రాంతాల్లో ఈ ఔషధం లభించని పరిస్థితి వచ్చింది. బ్లాక్‌మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయింది. వాస్తవానికి ఈ సూది మందుకు 'అత్యవసర వినియోగ అనుమతి' మాత్రమే ఉంది. ఇంకా నిర్ధరణ కాని, ప్రయోగాల దశలో ఉన్న ఔషధం అయినా ఏమాత్రం వెనుకాడకుండా వినియోగిస్తున్నారు. దీనివల్ల దుష్ఫలితాలు కనిపించే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), ఎయిమ్స్‌- దిల్లీ వర్గాలు ఇదే విషయాన్ని ఇటీవల స్పష్టం చేశాయి. ఇష్టానుసారంగా దీన్ని వాడవద్దని, దానివల్ల లాభాలు కంటే నష్టాలే ఎక్కువని హెచ్చరించాయి.

తొందరపాటు వద్దు...

ప్రయోగాల దశలో ఉన్న టొసిలిజుమ్యాబ్‌ వినియోగించే విషయంలో ఏమాత్రం తొందరపాటు వద్దని మహారాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇటీవల హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలనూ జారీ చేసింది. రోగి పరిస్థితిని బట్టి ఈ ఔషధం ఇవ్వాల్సిన అవసరం ఉందా... లేదా, ఇస్తే ఎంత డోసు ఇవ్వాలి... అనే అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వైద్యులకు సూచించింది. అంతేగాక దీని లభ్యత తగినంతగా లేదని, అందువల్ల ప్రత్యామ్నాయాలపై వైద్యులు దృష్టి పెట్టాలని కోరింది.

'రోష్‌' ప్రయోగాలు

'టొసిలిజుమ్యాబ్‌' స్విస్‌ కంపెనీ అయిన రోష్‌కు చెందిన ఔషధం. దీన్ని మనదేశంలో సిప్లా దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. ఒక్కో ఇంజక్షన్‌ ఖరీదు దాదాపు రూ.30,000గా ఉంటే.. బ్లాక్‌ మార్కెట్లో ఒక రూ.లక్ష వరకూ ఖర్చు చేయాల్సి పరిస్థితి ఉంది. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే... కొవిడ్‌-19 వల్ల సోకే న్యూమోనియా వ్యాధిని అడ్డుకోవటంలో ఇది పనిచేయటం లేదని తాజా ప్రయోగాల్లో స్పష్టం కావటం! 'ఈ ఇంజక్షన్‌ ఇచ్చినందువల్ల రోగులు త్వరగా కోలుకుంటున్నట్లు కానీ, మరణాలు తగ్గుముఖం పడుతున్నట్లు కానీ ప్రయోగాల్లో ఇప్పటి వరకూ నిర్ధరణ కాలేదు' అని రోష్‌ ఇటీవల ప్రకటించింది. కానీ దీనిపై ఇంకా ప్రయోగాలు కొనసాగించనున్నట్లు వెల్లడించింది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైద్యులు దీన్ని సిఫారసు చేస్తూనే ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు, వారి బంధువులు అందుకు అంగీకరిస్తూ, ఎక్కడ ఈ ఔషధం దొరుకుతుందా.. అని అన్వేషిస్తున్నారు.

ఇదీ చూడండి:కృత్రిమ మేధ ఉద్యోగాలు పెరుగుతున్నాయ్‌

ABOUT THE AUTHOR

...view details