కరోనా వల్ల చాలా మంది ఆదాయాలు భారీగా తగ్గిపోయాయి. వారు ఖర్చు చేసే తీరు కూడా మారిపోయింది. ఫలితంగా క్రెడిట్ కార్డుల వినియోగం పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డును భారంగా భావిస్తున్న చాలా మంది.. దాన్ని రద్దు చేసుకోవాలనే యోచనలో ఉన్నారు. అయితే క్రెడిట్ కార్డుల రద్దు సరైన నిర్ణయం కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. కార్డు రద్దు కంటే డౌన్‌గ్రేడ్ చేసుకోవటం మేలని సూచిస్తున్నారు.
ఇంతకీ డౌన్‌గ్రేడ్ చేసుకోవడం అంటే ఏమిటి? డౌన్‌గ్రేడ్‌తో ప్రయోజనం ఎంత? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డు రకం ఆధారంగా ప్రయోజనాలు
క్రెడిట్ కార్డు రకం ఆధారంగా ప్రయోజనాలు ఉంటాయి. ట్రావెల్, డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్‌కు సంబంధించినవి ఇందులో ఉంటాయి. ప్రస్తుతం కరోనా వల్ల ప్రయాణాలు, బయటం తినటం, సినిమాలు తగ్గిపోయాయి. దీనితో కార్డులను ఉపయోగించి ప్రయోజనాలు పొందే పరిస్థితి లేదు. అయినప్పటీ.. వాటిపై వార్షిక ఛార్జీలు లాంటి భారం మోయాల్సి ఉంటుంది. డౌన్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు.
వార్షిక రుసుము తప్పించుకోవడం ఎలా?
క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసినప్పుడు రివార్డులు వస్తుంటాయి. ఈ రివార్డులు, ఇతర క్రెడిట్ కార్డు ప్రయోజనాల వల్ల కలిగే లాభం కంటే.. వార్షిక ఛార్జీలు ఎక్కువైనప్పుడు క్రెడిట్ కార్డు గురించి పునరాలోచించాలి. రివార్డులు ఉపయోగించని స్థితిలో తక్కువ రివార్డులు ఉన్న వాటికి డౌన్‌గ్రేడ్ చేయించుకోవడం ఉత్తమం. అలా కాకుండా.. కార్డును రద్దు చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. కాబట్టి డౌన్‌గ్రేడ్ చేసుకోవటం ఉత్తమమైన ఎంపికని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు అంటున్నారు.