తెలంగాణ

telangana

ETV Bharat / business

Home Loan: ఇంటి రుణం తొందరగా తీరాలంటే? - ఇంటి రుణం ఈఎంఐ చెల్లింపు

ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? రుణం తీసుకొని ఇంటిని కొనుగోలు చేయాలని యోచిస్తున్నారా? మరి ఇంటి రుణం(Home Loan) ఈఎంఐ వేగంగా చెల్లించే మార్గాలేమిటో మీకు తెలుసా? వీటితో పాటు పెట్టుబడులు, జీవిత బీమా గురించి పలువురి ప్రశ్నలకు నిపుణుల సమాధానాలు తెలుసుకోండి...

house loan emi
Home Loan: ఇంటి రుణం తొందరగా తీరాలంటే?

By

Published : Jul 17, 2021, 12:16 PM IST

నాకు ఇటీవలే వివాహం అయ్యింది. ఇద్దరమూ ఉద్యోగులమే. ఇద్దరి పేరుమీద కలిసి ఉమ్మడిగా ఒక టర్మ్‌ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాం. త్వరలోనే ఇల్లు కొనాలనే ఆలోచనతో నెలకు రూ.40 వేల వరకూ జమ చేయాలనుకుంటున్నాం. ఈ మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?

-శ్వేత

టర్మ్‌ పాలసీ తీసుకోవాలనే ఆలోచన మంచిదే. అయితే, ఉమ్మడిగా కాకుండా.. ఇద్దరు వేర్వేరుగా పాలసీ తీసుకోండి. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ జీవిత బీమా విలువ ఉండేలా చూసుకోండి. దీనితోపాటు వ్యక్తిగత ప్రమాద బీమా, డిజేబిలిటీ ఇన్సూరెన్స్‌లూ తీసుకోండి. ఇద్దరికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఆరోగ్య బీమా తీసుకోండి. ఒకవేళ మీ యాజమాన్యం మీకు ఆరోగ్య బీమా పాలసీ ఇస్తున్నా.. సొంతంగా మరోటి తీసుకోవడం ఉత్తమం. మీరు తొందరలోనే ఇల్లు కొనాలని అనుకుంటున్నారు కాబట్టి, సురక్షిత పథకాలను ఎంచుకోవడమే మంచిది. దీనికోసం బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ పథకాన్ని పరిశీలించండి.

రూ.35 లక్షల ఇంటి రుణం( Home Loan) తీసుకున్నాను. నెలకు రూ.32,500 వరకూ ఈఎంఐ చెల్లిస్తున్నాను. ఇప్పటికి మూడేళ్లు అవుతోంది. గృహరుణం తొందరగా తీర్చేందుకు మరో రూ.15వేల వరకూ ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఆరేళ్ల తర్వాత ఇలా జమైన మొత్తాన్ని గృహరుణాని(Home Loan)కి చెల్లిస్తే మంచిదేనా? లేకపోతే ఈఎంఐనే పెంచుకోవాలా?

-రాజేశ్‌

మీరు గృహరుణంపై చెల్లించే ఈఎంఐలో అసలు, వడ్డీ కలిసి ఉంటాయి. రుణం తీసుకున్న తొలినాళ్లలో వడ్డీ మొత్తం అధికంగా ఉంటుంది. అసలు తక్కువగా ఉంటుంది. వడ్డీపై రూ.2లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. సెక్షన్‌ 80సీలో గృహరుణం అసలుకు పరిమితి మేరకు (సెక్షన్‌ పరిమితి గరిష్ఠంగా రూ.1,50,000) మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు. మీరు పెట్టాలనుకుంటున్న రూ.15వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. ఆరేళ్ల సమయం ఉందంటున్నారు కాబట్టి, మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అనుకుంటున్న సమయం వచ్చాక.. జమైన మొత్తాన్ని తీసి, గృహరుణానికి పాక్షికంగా చెల్లించండి. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల పనితీరును ఏటా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది.

మా అమ్మాయి వయసు 19 ఏళ్లు. తన పేరుతో మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు ప్రారంభించాలని ఆలోచన. తను చదువుకుంటోంది. ఆదాయం ఉంటేనే ఫండ్లలో మదుపు చేసేందుకు వీలవుతుందా? నెలకు కనీసం రూ.5వేలు మదుపు చేస్తే.. 10 ఏళ్లలో ఎంత అయ్యేందుకు వీలుంది?

- మహిపాల్‌

ఆదాయం ఉన్న వారే మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనే నిబంధన ఏదీ లేదు. నెలనెలా మీరు రూ.5 వేలను మీ అమ్మాయి ఖాతాకు బదిలీ చేయండి. ఆ తర్వాత క్రమానుగత పెట్టుబడి విధానంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి ప్రారంభించవచ్చు. నెలకు రూ.5 వేలను 10ఏళ్ల పాటు 12 శాతం రాబడి అంచనాతో మదుపు చేస్తే.. దాదాపు రూ.10,52,924 అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మున్ముందు మీ ఆదాయం పెరిగితే.. ఈ పెట్టుబడి మొత్తాన్ని పెంచండి. అప్పుడు అధిక డబ్బు జమ అయ్యేందుకు వీలవుతుంది.

నా వయసు 57 ఏళ్లు. మరో ఏడాదిలో పదవీ విరమణ చేయబోతున్నాను. ఇప్పుడు నేను టర్మ్‌ ఇన్సూరెన్స్‌, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేందుకు వీలుందా?

- సత్యనారాయణ

ఇప్పుడు 70 ఏళ్ల వారికీ టర్మ్‌ ఇన్సూరెన్స్‌, ఆరోగ్య బీమా పాలసీలను తీసుకునే అవకాశాన్ని బీమా సంస్థలు కల్పిస్తున్నాయి. అయితే, టర్మ్‌ పాలసీ, ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో వచ్చిన ఫలితాలను బట్టి, కంపెనీ విచక్షణ మేరకు పాలసీలు ఇస్తాయి. దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేసేటప్పుడు ముఖ్యంగా ఆరోగ్య పరమైన వివరాలు జాగ్రత్తగా ఇవ్వాలి. ఇప్పటివరకూ ఏదైనా ఆపరేషన్లు జరిగినా.. ప్రమాదాల బారిన పడినా ఆ వివరాలను కచ్చితంగా తెలియజేయాలి.

(-తుమ్మ బాల్‌రాజ్‌)

ABOUT THE AUTHOR

...view details