కర్బన ఉద్గారాల నుంచి మనదేశానికి పూర్తి విముక్తి లభించాలంటే ఏం చేయాలి? కాలుష్యాన్ని పెద్దఎత్తున వెదజల్లుతున్న థర్మల్ విద్యుత్కేంద్రాలకు ప్రత్యామ్నాయం ఏమిటి? ఈ అంశంలో కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మనదేశం కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించాలంటే, 2070 నాటికి 5,630 గిగావాట్ల (1 గిగావాట్= 1,000 మెగావాట్లు) సౌరవిద్యుత్తు సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. దీనికి మనదేశ భూభాగంలోని 4.6% భూమి కావాలి. అంతేగాక సౌర విద్యుత్తు పలకలను రీసైకిల్ చేయటానికి అవసరమైన సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యాన్ని సమకూర్చుకోవాల్సి వస్తుంది.
ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు ఈ నెలాఖరులో యూకేలోని గ్లాస్‌గో లో మొదలు కానుంది. 197 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించటానికి ఒక్కో దేశం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో... ఈ సదస్సులో చర్చించి స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశిస్తారు. దానికి తగ్గట్లుగా ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో మనదేశంలోని పరిస్థితిపై సీఈఈడబ్ల్యూ నిర్వహించిన అధ్యయనం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
మనదేశానికి ప్రస్తుతం 100 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం ఉంది. ఇందులో సౌరవిద్యుత్తు వాటా 40 గిగావాట్లు. దీన్ని 2030 నాటికి 450 గిగావాట్లకు పెంచుకోవాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. కర్బన ఉద్గారాల నుంచి 2070 నాటికైనా మనదేశం పూర్తిగా బయటపడాలంటే, ధర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో కానీ, ఫ్యాక్టరీల్లో కానీ బొగ్గు వినియోగాన్ని నిలుపుదల చేయాలి. 2060 నాటికే ఈ పని చేయాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. ముడి చమురు వినియోగం 2050 తర్వాత పెరగకూడదు. 2050 నుంచి 2070 మధ్యకాలంలో ముడిచమురు వినియోగాన్ని 90% తగ్గించాలి. అదే సమయంలో గ్రీన్-హైడ్రోజన్ వినియోగాన్ని పెంపొందించటం అవసరం. ఈ లక్ష్యాల సాధనకు అయ్యే ఖర్చు ఎంతో ఎక్కువ. ఇది 2070లో మనదేశ జీడీపీలో 4.1 శాతానికి సమానంగా ఉంటుంది. అయితే 2050 నాటికే ఈ లక్ష్యాన్ని సాధించాలనుకుంటే, 2050లో మనదేశం జీడీపీలో 7 శాతానికి సమానమైన మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేగాక ఈ మార్పు సాధించే క్రమంలో విద్యుత్తు వ్యయాలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం పొంచి ఉంటుంది.