కోటీశ్వరులు కావాలని కోరుకోని వారెవరు చెప్పండి. ఇలా ఆలోచించే వారిలో తమ లక్ష్యాన్ని చేరుకునేవారు మాత్రం కొందరే ఉంటారు. కారణం అందరూ అంత క్రమశిక్షణతో తమ ప్రణాళికలను అమలు చేయకపోవడమే. కాలం… అవకాశం ఒకసారి చేజారితే మళ్లీ తిరిగి రావు. పొదుపు, మదుపు విషయం కూడా అంతే. ఒక్కసారి పొరపాటు చేశామా? అంతే… కోటీశ్వరులైనా… మళ్లీ మొదటి నుంచే ప్రారంభించాల్సి రావచ్చు. ప్రస్తుతం ఎవరిని కదిలించినా వేలకు వేల జీతాన్ని ఆర్జిస్తున్నామని గర్వంగా చెబుతుంటారు. కానీ, నెలాఖరునాటికి ఎంత మొత్తం చేతిలో ఉంటుంది అని అడిగితే మాత్రం అయోమయంగానే చూస్తారు.
జీవన శైలిలో మార్పులు, పెరుగుతున్న ఖర్చుల వల్ల ఎంతోకొంత అప్పు చేస్తేగానీ బయటపడని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఆకస్మిక ఖర్చులు వస్తే చెప్పాల్సిన పనేలేదు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుతో అప్పులు, ఇలా అందిన చోటల్లా అప్పు తెచ్చి… వందలకు వందలు వడ్డీలకిందే జమ చేసేస్తుంటారు. అందుకే, మనం అనుకుంటున్న లక్ష్యం ఎప్పుడూ కళ్లముందే కనిపిస్తున్నా… చాలామంది దాన్ని చేరుకోవడానికి ఓ జీవిత కాలం సరిపోకపోవచ్చు. అసలు సాధారణంగా వ్యక్తిగత ఆర్థిక అంశాల్లో మనం చేసే పొరపాట్లేమిటి? ఎందుకు మనం ధనవంతులుగా మారలేకపోతున్నాం?
అదుపులేని ఖర్చు
సంపాదించిందంతా ఖర్చులకే వెళ్తొందని బాధపడుతుంటారు చాలామంది. కేవలం నాకే ఎందుకిలా అనుకుంటారు… ఇక్కడ గమనించాల్సిందేమిటంటే… దాదాపు 52 శాతం మంది ఇలా వచ్చింది వచ్చినట్లు ఖర్చు చేసేవారే. ఇందులో కొంతమంది తమకు వచ్చిన ఆదాయం మేరకే వ్యయం చేస్తుంటే… 22 శాతం మంది మాత్రం క్రెడిట్ కార్డు ఇతర మార్గాల్లో తమ ఖర్చులను వెళ్లదీస్తున్నారు. ప్రతి నెలా సంపాదించందంతా ఖర్చు పెట్టేస్తుంటే… ఎప్పటికీ మనం ధనవంతులుగా మారలేం. అందుకే, వచ్చిన సొమ్ము ఎటు వెళ్తుందనే దానిపైన నిఘా వేయండి. ఎక్కడెక్కడ వృథా ఖర్చు అవుతుందనే విషయాన్ని పట్టించుకోండి. వాస్తవిక దృష్టితో ఆలోచించించి బడ్జెట్ వేసుకోండి. అప్పుడే ఖర్చులు తగ్గి, మిగులు కనిపిస్తుంది.
తగినంతగా దాచకోకపోవడం
ధనవంతులుగా మారాలంటే పాటించాల్సిన మొదటి సూత్రం ఏమిటో తెలుసా? తగినంత పొదుపు చేయడం. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, రుణాల వడ్డీరేట్లు సంపాదనంతా హరించి వేస్తున్నాయి. పొదుపు చేయడానికే మిగలడం లేదు. ఇక పెట్టుబడి గురించి ఆలోచన ఎక్కడ? ప్రస్తుతం చాలామంది ధోరణి ఇలాగే ఉంది. ప్రతి నెలా ఖర్చు చేయగా మిగిలినదే పొదుపు అని పొరపడుతుంటారు. ఖర్చుపెట్టగా మిగిలింది కాకుండా ప్రతి నెలా లక్ష్యంగా పెట్టుకొని మిగిల్చిందే పొదుపు అనేది మర్చిపోకూడదు.
అందుకే, పొదుపు మొత్తాన్ని కూడా ఒక అత్యవసర, ప్రథమ ఖర్చు జాబితాలో రాసుకోండి. ఆ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించండి. అప్పుడే భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే ఆర్థిక సామర్థ్యం మన సొంతం అవుతుంది. అత్యవసరాల కోసమే కాదు… భవిష్యత్తు కోసం ఎంతో కొంత దాచుకోవాలనేది ఎవరూ కాదనలేని నిజం. ఇప్పటి లెక్కలతో రానున్న ఐదారేళ్ల కాలాన్ని కూడా సరిపోల్చలేం. అందుకే, సాధ్యమైనంత మేరకు దాచుకోవాల్సిన పరిస్థితి. ఒక మాటగా చెప్పాలంటే… మనకు వచ్చే ఆదాయంలో కనీసం 10 నుంచి 20 శాతం వరకూ పొదుపు చేస్తే బాగుంటుంది.
అప్పు చేసి పప్పుకూడు
అప్పు చేయందే ఏ పనీ తోచదు కొంతమందికి. ఇందులో మంచి అప్పులు… చెడ్డ అప్పులు ఉంటాయి. విద్యారుణం, గృహరుణంలాంటివి మంచి అప్పుల జాబితాలోకి వస్తాయి. అదే వ్యక్తిగత రుణం తీసుకొని విహార యాత్రకు వెళ్లారనుకోండి… క్రెడిట్ కార్డు ఉందికదా అని ఖరీదైన హోటళ్లో భోజనం చేద్దామనుకుంటే… ఇవీ చెడ్డ అప్పులు. వీటివల్ల మనకు ఆర్థికంగా ప్రయోజనం రాదు సరికదా! అప్పుల వూబిలోకి దిగజారుస్తాయి. పైగా ఈ అప్పులకు వడ్డీలు కట్టేందుకే, సంపాదించిందంతా వెళ్లిపోతుంది.
అవసరంలో ఎవరినీ చేయిచాచి అర్థించకుండా… అప్పులు చేయకుండా ఉండాలంటే… మన మనస్తత్వంలో మార్పు రావాలి. మీరు సంపాదించిదంతా… వెంట వెంటనే ఖర్చు చేయాలన్న ఆలోచనల్నుంచి ముందుగా బయటపడాలి. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలను వెంటనే తీర్చేయడానికి ప్రయత్నించండి. కొన్ని మంచి పనులకు మనలోని కొన్ని గుణాలను త్యాగం చేయాల్సిందే. పొదుపు విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఇలా చేయగలిగినప్పుడే కోటీశ్వరులుగా మారాలనే మీ కోరిక సిద్ధిస్తుంది.
సరైన ప్రణాళిక లేకపోవడం
ఎక్కడికెళ్లాలో తెలియకుండా ప్రయాణం ప్రారంభించం. ఆర్థిక విషయాల్లో కూడా అంతే. ఏం సాధించాలో తెలియకుండా వూరికే పొదుపు, పెట్టుబడుల వల్ల ఫలితం ఉండదు. సరైన ప్రణాళిక లేకపోతే కోటీశ్వరులు కావాలనుకోవడం తీరని కలగానే మిగిలిపోతుంది. ప్రణాళిక వేసుకోవడంలో విఫలం కావడం అంటే… లక్ష్య సాధనకు కూడా దూరం కావడమే.