అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పాతాళానికి పడిపోయాయి. ఒపెక్ దేశాలు, రష్యా మధ్య విభేదాలతో నేలకు దిగొచ్చిన ముడి చమురు ధరలు.. ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగే వరకు క్రూడ్ ధరలు నేలపైనే ఉంటాయని చెబుతున్నారు.
బ్రెంట్ క్రూడాయిల్ ధరలు సోమవారం 30 శాతం పడిపోయి 31 డాలర్లకు చేరింది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) కూడా 27 శాతం క్షీణించి 30 డాలర్లకు దిగజారి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత అంతటి భారీ పతనాన్ని చవిచూశాయి చమురు ధరలు.
అయితే ఈ రోజు స్వల్పంగా పెరిగిన డబ్ల్యూటీఐ, బ్రెంట్ ధరలు 33, 36 డాలర్లకు చేరుకున్నాయి.
ఎందుకిలా?
చమురు ధరలు భారీగా పడటానికి మొదటి కారణం సౌదీ అరేబియా, రష్యా మధ్య విభేదాలు. కరోనా వైరస్ నేపథ్యంలో చమురుకు భారీగా డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో ఒపెక్ గురువారం సమావేశమై ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించింది. 2020 చివరి వరకు 1.5 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిపై కోత పెట్టాలని నిర్ణయించింది. గత డిసెంబర్‌లో నిర్ణయించిన చమురు ఉత్పత్తి కోతకు ఇది అదనం.
కానీ, ఒపెక్ దేశాలతోపాటు చమురు ఉత్పత్తిలో అతిపెద్ద దేశమైన రష్యా దీనికి ససేమిరా అంటోంది. ఇది సౌదీ అరేబియాకు ఇబ్బందికరంగా మారింది. చమురు బ్యారెల్‌కు 83డాలర్ల ధర లభిస్తేనే ఆ దేశ బడ్జెట్ అంచనాలను అందుకుంటుంది. మరోపక్క చమురు ధర బ్యారెల్‌కు 43 డాలర్ల కంటే తగ్గితే రష్యా కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.