ఒక వస్తువు కొనాలంటే వేర్వేరు చోట్ల ఉన్న ధరలు పోల్చుకుని చూస్తుంటారు. ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడ కొనుగోలు చేస్తుంటారు. ఒకప్పుడు భౌతికంగా దుకాణాలు తిరిగి తెలుసుకునే వారు. ఇప్పుడు ఆన్లైన్లోనే ఆ పని చేయటానికి వీలువుతుంది. ఎక్కువ సందర్భాల్లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తక్కువ ధరను అందిస్తున్నాయి.
ఈ-కామర్స్ సంస్థలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే భౌతికంగా ఒక ఉత్పత్తి మనకు వచ్చేటప్పుడు ఎన్ని స్థాయిలు దాటుతుందో తెలుసుకోవాలి. ఒక వస్తువు ఉత్పత్తి అయినప్పుడు హోల్‌సేల్ ధర వద్ద వ్యాపారి కొనుగోలు చేస్తారు. దీనికి హోల్‌సేల్ వ్యాపారి తన లాభాన్ని కలుపుకొని రిటైలర్‌కు అందిస్తారు. రిటైలర్ తన లాభాన్ని కలుపుకొని వినియోగదారులకు విక్రయిస్తుంటారు. ఈ స్థాయిలు ఉత్పత్తిని బట్టి పెరగవచ్చు. ఈ స్థాయిల్లో మార్జిన్ కలవటం వల్ల ఉత్పత్తి ధర పెరుగుతుంది.
తక్కువ ధర లేదా ఆఫర్లకు కారణం ఇదే..
ఆన్లైన్ అయితే హోల్‌సేల్ నుంచి వినియోగదారుడికి అందుతుంది. కాబట్టి ధర తగ్గిపోతుంది. అంతేకాకుండా కంపెనీలు అందించే డిస్కౌంట్లు దీనికి అదనం. వివిధ బ్యాంకులు కూడా తమ కార్డు వినియోగాన్ని పెంచుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. దీని వల్ల కూడా ధర తగ్గుతుంది.
కంపెనీలు తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు, ఎక్కువ విక్రయించేందుకు ధరను తగ్గించవచ్చు. దీనివల్ల ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది. వీటి విషయంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు కూడా తమ మార్జిన్ తగ్గించుకున్నట్లయితే తక్కువ ధరకే వినియోగదారుడు పొందవచ్చు. భారీ డిస్కౌంట్లకు ఇదే ప్రధాన కారణం అనుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేస్తే కూడా రకాల డిస్కౌంట్లు పొందవచ్చు. అందులో క్లియరెన్స్ సేల్(విక్రయం కాకుండా ఉన్న వాటిని అమ్మేందుకు ఆఫర్లు ఇవ్వటం), ఇయర్ ఎండ్ సేల్(సంవత్సరాంతంలో ఆఫర్లు ఇవ్వటం) అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవి ఆన్‌లైన్‌కు కూడా వర్తిస్తాయి. ఈ-కామర్స్ సంస్థలు లేదా విక్రయదారుల వద్ద ఎక్కువ స్టాక్ ఉన్న దృష్ట్యా.. ఎక్కువ డిస్కౌంట్లను అందించే అవకాశాలుంటాయి.