2019లో ఆర్థిక మందగమనం నెలకొన్నప్పటికీ దేశీయంగా గృహ విక్రయాల్లో పెరుగుదల నమోదైనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో దాదాపు 2.46 లక్షల ఇళ్లు అమ్ముడుపోయినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ 'నైట్ ఫ్రాంక్' వెల్లడించింది. 2018తో పోలిస్తే గతేడాదిలో నివాస ఆస్తుల అమ్మకాల్లో ఒక శాతం వృద్ధి నమోదైనట్లు నివేదికలో తెలిపింది. దేశీయంగా ఉన్న అన్ని ప్రతికూలతలను ఎదుర్కొని హౌసింగ్ మార్కెట్ అభివృద్ధి చెందినట్లు స్పష్టం చేసింది.
2019లో ఇళ్ల ధరలు కూడా స్పల్పంగా పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముద్దాసిర్ జైదీ తెలిపారు. గతేడాది ఇళ్ల ధరలు 4 నుంచి 5 శాతం పెరిగినట్లు వెల్లడించారు. అయితే 2015తో పోలిస్తే ఇది చాలా స్పల్పమేనని స్పష్టం చేశారు.
2.45 లక్షల విక్రయాలు
2018లో 2,42,328 యూనిట్ల విక్రయాలు జరగ్గా... 2019లో ఈ సంఖ్య 2,45,861కి చేరిందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా స్థిరాస్తి వ్యాపారులు సైతం ధరల్లో సరళంగా వ్యవహరించడం కూడా అమ్మకాలు పెరగడానికి కారణమని అభిప్రాయపడింది.
బెంగళూరులో అధికం
దిల్లీ-ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం), బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్లో గృహ విక్రయాల్లో పెరుగుదల నమోదు కాగా ముంబయి, పుణె, కోల్కతా నగరాల్లో విక్రయాలు తగ్గినట్లు తెలిపింది. బెంగళూరులో అత్యధికంగా 10 శాతం పెరిగి 42,828 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు వెల్లడించింది. చెన్నైలో 6 శాతం వృద్ధితో 16,959, హైదరాబాద్లో 4 శాతం వృద్ధితో 16,267 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు స్పష్టం చేసింది.