గిరాకీ పెరుగుతున్నందున, రానున్న ఏళ్లలో దేశీయ స్థిరాస్తి విపణి వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ముడి సరుకు వ్యయాలకు అనుగుణంగా గృహాల ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కొవిడ్-19 మొదటి, రెండో విడతల అనంతరం ఇళ్ల అమ్మకాలు బలంగా పుంజుకోవడం ఆశ్చర్యకర పరిణామమని సీఐఐ- ఆన్‌రాక్ నిర్వహించిన వెబ్‌నార్‌లో స్థిరాస్తి డెవలపర్లు, కన్సల్టెంట్లు అభిప్రాయపడ్డారు.
ధరలు పెరగడం అనివార్యం..
కరోనా మహమ్మారి సమయంలో ఇళ్ల అమ్మకాలు నెమ్మదించినప్పటికీ.. దిగ్గజ బ్రాండు డెవలపర్ల మార్కెట్ వాటా పెరిగిందని తెలిపారు. 'గృహాల ధరలు పెరగడం అనివార్యం. నిర్మాణ ఖర్చులు భారీగా పెరగడం ఇందుకు కారణమ'ని ఒబెరాయ్ రియాల్టీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు వికాశ్ ఒబెరాయ్ తెలిపారు. ముడి సరకు వ్యయాలు, సరఫరా కొరత కూడా ధరలపై ప్రభావం చూపించొచ్చని అభిప్రాయపడ్డారు. స్థిరాస్తి అభివృద్ధి సంస్థలు చిన్నవైనా.. పెద్దవైనా.. స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదైనా.. కాకపోయినా.. అత్యుత్తమ ట్రాక్ రికార్డు ఉంటే తప్పకుండా రాణిస్తాయని తెలిపారు. స్థిరాస్తుల కొనుగోళ్లు పెరగడం స్పష్టంగా కన్పిస్తోందని, ఈ రంగం వృద్ధి బాటలో పయనించేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. అందుబాటు ధర గృహ విభాగంలోకి తాము అడుగుపెట్టాలంటే.. ప్రభుత్వం ఓ పటిష్ఠ విధానం, కార్యక్రమంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముడి సరుకు ధరలు ప్రియం కావడంతో రాబోయే ఏడాది కాలంలో గృహాల ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న శ్రీరామ్ ప్రోపర్టీస్ ఎండీ ఎం.మురళి తెలిపారు.
ఇదీ చదవండి:మార్కెట్ జోరులో నిలిచి, గెలిచేదెలా?
ఐపీఓకు స్నాప్డీల్.. సమీకరణ ఎంతంటే?