కొవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ.. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, హైదరాబాద్ స్థిరాస్తి విపణి వృద్ధి పథంలో సాగుతోంది. ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇక్కడి నివాస గృహాల అమ్మకాలు 39 శాతం పెరిగాయని ఆన్‌లైన్ స్థిరాస్తి బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్.కామ్ శుక్రవారం వెల్లడించింది.
నూతన ఇళ్ల నిర్మాణంలోనూ 95 శాతం వృద్ధి కనిపిస్తోందని తెలిపింది. ఇళ్ల అమ్మకాలకు ఇక్కడ తక్కువ సమయమే పడుతోందని, మార్చి త్రైమాసికంలో 7,721 ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు తెలిపింది. 2020 ఇదేకాలంలో ఈ సంఖ్య 5,554గా నమోదయ్యింది. విలువ పరంగా దాదాపు 34 శాతం వృద్ధితో రూ.8,400 కోట్లకు చేరింది.
2-3 పడకగదుల ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది. రూ.75 లక్షల విలువైన గృహాలు ఎక్కువగా అమ్ముడవుతుండగా, తదుపరి స్థానంలో రూ.45-75 లక్షల గృహాలున్నాయి. సంగారెడ్డి, బాచుపల్లి, కొంపల్లి, కొండాపూర్ లాంటి ప్రాంతాలు ఈ డిమాండుకు ప్రధాన కారణం.
కొత్త ప్రాజెక్టుల హవా
నూతన ప్రాజెక్టులు 95శాతం వృద్ధితో 7,604 యూనిట్లు ప్రారంభమయ్యాయి. నల్లగండ్ల, కొంపల్లి ప్రాంతాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. వీటిల్లో 49 శాతం ఇళ్లు రూ.75లక్షలకు పైబడినవే. రూ.45-75 లక్షల శ్రేణిలో 40శాతం ఉన్నాయి. 2 పడకగదుల ఇళ్ల వాటా 28 శాతం నుంచి 48 శాతానికి పెరిగింది.
కొవిడ్ ముందు స్థాయులకు
హైదరాబాద్ నివాస గృహాల మార్కెట్ కొవిడ్ ముందునాటి అమ్మకాల సంఖ్యను అధిగమించిందని హౌసింగ్.కామ్, మకాన్.కామ్, ప్రాప్‌టైగర్.కామ్ గ్రూపు సీఈఓ మణి రంగరాజన్ వెల్లడించారు. అతి తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ధరల వల్ల గృహ విక్రయాలు మళ్లీ పుంజుకున్నట్లు వెల్లడించారు. 2020 జులై నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు విక్రయాలు బాగున్నాయని తెలిపారు. కొవిడ్ రెండోదశ ప్రభావం స్థిరాస్తిపై ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. జనవరి- మార్చి మధ్య స్థిరాస్తి ధరల్లో 5శాతం వృద్ధి కనిపించిందని తెలిపారు. నగరంలో చదరపు అడుగును సగటున సుమారు రూ.5,713కు విక్రయిస్తున్నారన్నారు.
ఇదీ చదవండి :'భారత్ వేరియంట్' సమాచారాన్ని తొలగించండి'