తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఇళ్ల ధరల పెరుగుదలలో దేశంలోనే హైదరాబాద్ టాప్​' - నైట్‌ ఫ్రాంక్‌ ఇళ్ల ధరల నివేదిక

Home prices in hyderabad: ఇళ్ల ధరల పెరుగుదల విషయంలో దేశంలోని 8 ప్రధాన నగరాలతో పోల్చినప్పుడు హైదరాబాద్​ మొదటి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా 128వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రముఖ స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఈ మేరకు మూడో త్రైమాసికానికి సంబంధించి విడుదల చేసిన 'గ్లోబల్‌ రెసిడెన్షియల్‌ సిటీస్‌ ఇండెక్స్‌' నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

home prices
హైదరాబాద్​లో ఇళ్ల ధరలు

By

Published : Dec 27, 2021, 10:30 PM IST

Home prices in hyderabad: కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. ప్రజల కొనుగోళ్ల శక్తి కూడా మునుపటితో పోలిస్తే పెరిగింది. ముఖ్యంగా సొంత ఇంటికి ఆదరణ పెరగడం, తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తుండడం వంటి తదితర పరిణామాలతో గృహ విక్రయాలు పెరిగాయి. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా ఇళ్ల ధరలు సైతం పెరుగుతున్నాయి. ఈ విషయంలో హైదరాబాద్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇళ్ల ధరల పెరుగుదల విషయంలో దేశంలోని 8 ప్రధాన నగరాలతో పోల్చినప్పుడు భాగ్యనగరం మొదటి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా 128వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రముఖ స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఈ మేరకు మూడో త్రైమాసికానికి సంబంధించి విడుదల చేసిన 'గ్లోబల్‌ రెసిడెన్షియల్‌ సిటీస్‌ ఇండెక్స్‌' నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గతేడాదితో పోల్చినప్పుడు హైదరాబాద్‌లో 2.5 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగినట్లు నివేదిక పేర్కొంది.

150 నగరాల్లోని ఇళ్ల ధర ఆధారంగా..

India house prices: ఈ విషయంలో 2.2 శాతం వృద్ధితో చెన్నై రెండో స్థానం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 131వ స్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలైన కోల్‌కతా 1.5 శాతం (135), అహ్మదాబాద్‌ 0.4 శాతం (139) వృద్ధితో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబయి ఈ విషయంలో - 1.8 శాతం క్షీణత నమోదు చేసింది. అంతర్జాతీయంగా 146వ స్థానంలో నిలిచింది. బెంగళూరు (0.2 శాతం), దిల్లీ (0.7 శాతం), పుణె (1.5 శాతం) మేర క్షీణత నమోదు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లోని పెరిగిన ఇళ్ల ధరలను ఆధారంగా చేసుకుని నైట్‌ ఫ్రాంక్‌ 2021 ఈ నివేదికను రూపొందించింది. క్యూ3లో గతేడాదితో పోల్చినప్పుడు సగటున 10.6 శాతం మేర వృద్ధి కనిపించినట్లు నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. 93 శాతం నగరాలు వృద్ధిని కనబరచగా.. 44 శాతం నగరాలు రెండంకెల వృద్ధిని వృద్ధి సాధించినట్లు నివేదిక పేర్కొంది.

ఆరు త్రైమాసికాలుగా..

ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలు, తక్కువ వడ్డీ రేట్లు వంటివి దేశంలో గృహ విక్రయాలు పెరగడంలో కీలక పాత్ర పోషించినట్లు నైట్‌ఫ్రాంక్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బాలాజీ తెలిపారు. ధరలు సైతం అందుబాటులో ఉండడం మరో కారణమని చెప్పారు. గత ఆరు త్రైమాసికాల నుంచి ఇదే ఒరవడి కొనసాగుతోందని, ఇదే తరహా ట్రెండ్‌ మరికొంతకాలం పాటు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు టర్కీకి చెందిన ఇజ్మీర్‌ (34.8 శాతం) అగ్రస్థానంలో8 నిలవగా.. న్యూజిలాండ్‌కు చెందిన వెల్లింగ్టన్‌ (33.5 శాతం) రెండో స్థానం సాధించింది.

ఇదీ చూడండి:గుడ్​ న్యూస్.. వంట నూనెల ధరలు తగ్గాయ్.. ఏ బ్రాండ్​పై ఎంతంటే...

ఇదీ చూడండి:కొత్త ఏడాదిలో దుస్తులు, పాదరక్షల ధరలకు రెక్కలు!

ABOUT THE AUTHOR

...view details