ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / business

Home Loan Tips: గృహరుణం అనుకున్నంత రావాలంటే.. - సరిపడా హోమ్​ లోన్​ రావాలంటే ఏం చేయాలి

Home Loan Tips: సొంత ఇల్లు.. చాలామంది కల. దీన్ని నెరవేర్చుకునే క్రమంలో గృహరుణం తీసుకోవడం సర్వసాధారణం. తక్కువ వడ్డీ రేట్లు ఉండటం, ఇళ్ల ధరలూ కాస్త అందుబాటులోనే కనిపిస్తుండటం వల్ల ఎంతోమంది ఇల్లు కొనడానికి సిద్ధం అవుతున్నారు. అయితే గృహ రుణాలు సులభంగా మీరు కోరుకున్నంత రావాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

Home Loan Tips
గృహరుణం
author img

By

Published : Dec 10, 2021, 1:31 PM IST

Home Loan Tips: గృహరుణ వడ్డీ రేట్లు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు సొంతింటి కోసం ఆలోచిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో అవసరమైన మేరకు రుణం రావాలంటే ఏం చేయాలనే సందేహం ఎంతోమందికి వస్తోంది. బ్యాంకు లేదా గృహరుణ సంస్థ ఒక వ్యక్తికి రుణం ఇచ్చేటప్పుడు ఏయే అంశాలు పరిశీలిస్తుంది.. రుణ గ్రహీత తన అర్హతను పెంచుకునేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం.

క్రెడిట్‌ స్కోరు కీలకం..

ఇప్పటి వరకూ తీసుకున్న రుణాలను ఎలా చెల్లించారు. అని నిర్ణయించే క్రెడిట్‌ నివేదిక, క్రెడిట్‌ స్కోరు కొత్త అప్పులను తీసుకోవడంలో కీలకంగా మారుతుంది. మంచి క్రెడిట్‌ స్కోరు కావాలంటే క్రెడిట్‌ కార్డు బిల్లులు, ఈఎంఐలను వ్యవధిలోపు కచ్చితంగా చెల్లించాలి. ఆలస్యం చేస్తే క్రెడిట్‌ స్కోరును దెబ్బతీస్తుంది. 750కి మించి స్కోరు ఉంటే మంచిదని చెప్పొచ్చు. వడ్డీ రేట్లలోనూ రాయితీ లభిస్తుంది.

ఉమ్మడిగా..

కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువమంది ఆర్జిస్తుంటే ఉమ్మడిగా రుణం తీసుకోవచ్చు. దీనివల్ల అధిక మొత్తం లభిస్తుంది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులతో కలిసి ఈ ఉమ్మడి రుణం తీసుకోవచ్చు. రుణ అర్హత పెరగడమే కాకుండా.. ఈఎంఐ భారాన్నీ పంచుకోవచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఇది ఉపయోగపడుతుంది.

వ్యవధి పెంచుకోవాలి..

అధిక మొత్తంలో అప్పు అవసరమైనప్పుడు వ్యవధి వీలైనంత ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఈఎంఐ భారం తగ్గి, మీ రుణం పెరుగుతుంది. దీనివల్ల వడ్డీ భారం అధికంగా ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు.

ఇతర అప్పులు..

గృహరుణ అర్హతను నిర్ణయించడంలో ఇతర అప్పులూ కీలకమే. ఇప్పటికే మీకు రెండుమూడు అప్పులుంటే వీటికి చెల్లించే ఈఎంఐ కొత్త రుణానికి అడ్డంకిగా మారుతుంది. కాబట్టి, చిన్న రుణాలను తీర్చేందుకు ప్రయత్నించండి. ఆదాయంలో 40శాతానికి మించి ఈఎంఐలు ఉండటం అంత శ్రేయస్కరం కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో 50శాతం ఉండొచ్చు.

ఇతర ఆదాయాలుంటే..

వేతనం ఒక్కటే కాకుండా.. ఇతర మార్గాల నుంచీ ఆదాయం వస్తుంటే.. ఆ లెక్కలను రుణదాతకు తెలియజేయండి. ఉదాహరణకు అద్దె, వ్యాపారం, వ్యవసాయం ద్వారా ఆదాయం వస్తుంటే ఆ వివరాలు చూపించండి. దీనివల్ల అధిక రుణం అందుకునేందుకు వీలవుతుంది.

స్వయం ఉపాధి పొందుతున్నా..

ఇప్పుడు కొత్తతరం గృహరుణ సంస్థలు అనేకం వచ్చాయి. క్రమం తప్పని ఆదాయం, క్రెడిట్‌ స్కోరు లేని వారికీ గృహరుణాన్ని అందిస్తున్నాయి. సహజంగానే వీటి రుణాలకు వడ్డీ అధికంగా ఉంటుంది.

అధికంగా చెల్లించండి..

సాధారణంగా బ్యాంకులు, రుణ సంస్థలు ఇంటి విలువలో 75-90 శాతం వరకూ రుణాలను ఇస్తుంటాయి. మిగతా మొత్తాన్ని మనమే సమకూర్చుకోవాలి. మీరు తక్కువ మార్జిన్‌ మనీని చెల్లిస్తే.. అధిక రుణం తీసుకోవాల్సి వస్తుంది. వడ్డీ భారమూ భరించాలి. దీనికన్నా.. మీ దగ్గర అందుబాటులో ఉన్నంత మొత్తం చెల్లించి, అవసరమైన మేరకే అప్పు తీసుకోండి.

అన్నీ చూశాకే..

గృహరుణం తీసుకునే తొందరలో కొన్ని కీలక అంశాలు మర్చిపోతుంటాం. ముందుగా ఏ బ్యాంకు/రుణ సంస్థను సంప్రదించాలో నిర్ణయించుకోండి. వడ్డీ ఎంత చెల్లించాలన్నది చూడండి. మీ సిబిల్‌ నివేదికలో ఏమైనా తప్పులు దొర్లాయా సరిచూడండి. పరిశీలనా రుసుములు, ఇతర ఫీజుల వివరాలూ తెలుసుకోండి. ఆ తర్వాతే ముందడుగు వేయండి.

ఇదీ చూడండి:Home Rates: ఆఫీసు స్థలానికి అనూహ్య గిరాకీ- ఇళ్ల ధరలు పైపైకి!

ABOUT THE AUTHOR

...view details