Home loan EMI payment problems: కొత్త ఇల్లు కొనడం అనేది ఒకప్పుడు చాలా మందికి జీవితకాల కల. కానీ, ఇప్పుడు చిన్న వయసులోనే బ్యాంకు రుణాలతో ఇల్లు సొంతం చేసుకుంటున్నారు చాలా మంది. ఈ రోజుల్లో బ్యాంకులు 6.55శాతం వడ్డీ రేటు నుంచే గృహ రుణాలు అందజేస్తున్నాయి. అయితే, గృహ రుణం తీసుకోవడం అనేది చాలా తేలిగ్గా అనిపించొచ్చు. దాన్ని సకాలంలో తిరిగి చెల్లించడానికి తగిన ఆర్థిక ప్రణాళిక అవసరం. ఒకవేళ రుణం సక్రమంగా చెల్లించకపోతే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలి? పరిష్కారానికి ఏం చేయాలి?
ప్రభావం ఇలా..
ఇంటి రుణ ఈఎంఐ చెల్లింపులను తరచూ ఆలస్యం చేసినా, కట్టకపోయినా రుణగ్రహీతలపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది. ముందుగా క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది రుణగ్రహీతల క్రెడిట్ యోగ్యతను దెబ్బతీస్తుంది. వారు భవిష్యత్‌లో కొత్త రుణాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా కోల్పోవచ్చు. గృహ రుణాన్ని ఏదైనా ఇతర బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలకు బదిలీ చేయాలనుకుంటే.. పేలవమైన రీపేమెంట్ హీస్టరీ కారణంగా బ్యాంకులు ఈ దరఖాస్తును తిరస్కరించొచ్చు. ఇటువంటి రుణగ్రహీతలు వ్యక్తిగత, కారు రుణాలు వంటివి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈఎంఐని ఆలస్యం చేస్తే నెలకు 1 నుంచి 2 శాతం వరకు బ్యాంకులు జరిమానా విధించొచ్చు. వరుసగా 3 నెలల ఈఎంఐలు తిరగి చెల్లించడంలో ఆలస్యం చేస్తే అది చిన్న డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. ఈ సందర్భంలో బ్యాంకు చెల్లింపుల కోసం రుణ గ్రహీతకు నోటీసులు పంపుతుంది. కానీ, ఈ ఆలస్యాన్ని ఇంకా పొడిగిస్తే సమస్య మొదలవుతుంది. 3 నెలల కంటే ఎక్కువ ఆలస్యం ప్రధాన డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. బకాయిలను రికవరీ చేయడానికి బ్యాంకు రుణ గ్రహీత ఆస్తిని వేలం వేసే ప్రక్రియను ప్రారంభించొచ్చు.
పెద్ద డిఫాల్ట్‌కి పాల్పడినప్పుడు బ్యాంకు డిఫాల్టర్ రుణాన్ని నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా గుర్తించి, తర్వాత రికవరీ విధానాన్ని ప్రారంభించవచ్చు. సాధారణంగా బ్యాంకులు రుణాన్ని ఎన్‌పీఏగా గుర్తించే ముందు నోటీసులు పంపుతాయి. కొన్ని సార్లు బ్యాంకులు తమ డబ్బు రికవరీ కోసం థర్డ్ పార్టీ ఏజెంట్లను నియమించుకుంటాయి. వారు రుణం గురించి రుణగ్రహీత దగ్గరకు రావడం, ప్రశ్నించడం చేదు అనుభవాన్ని ఇస్తుంది. దీనికి తోడు అదే బ్యాంకు నుంచి ఏదైనా ఇతర రుణాలను సదరు రుణ గ్రహీత పొందినట్లయితే వాటిని కూడా ఎన్‌పీఏలుగా ట్యాగ్ చేసే అవకాశం ఉంటుంది.