Himalayan Yogi: వ్యాపార రంగంలో రారాణిగా ఓ వెలుగు వెలిగిన ఎన్ఎస్ఈ మాజీ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణ.. ఓ అదృశ్య యోగి చేతిలో కీలుబొమ్మగా మారిన సంగతి విదితమే. అయితే.. ఆ యోగి ఎవరో ఇప్పుడు తెలిసిపోయింది. ఎన్‌ఎస్‌ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియనే ఆ యోగి అని.. అతడే తన బాస్ చిత్రా రామకృష్ణతో ఈ- మెయిళ్ల ద్వారా నిరాకార వ్యక్తిగా సంభాషణలు జరిపినట్లు సీబీఐ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ.. ఆనందే యోగి అనే విషయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
Chitra Ramakrishna NSE: చిత్రతో సంభాషణలు జరిపిన rigyajursama@outlook.com అనే మెయిల్ ఐడీని ఆనందే తెరిచినట్లు తమకు సాక్ష్యాలు లభించాయని దర్యాప్తు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ఈ-మెయిల్ ఐడీకి చిత్ర పంపిన కొన్ని మెయిళ్లకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు సుబ్రమణియన్‌కు చెందిన వ్యక్తిగత ఈ- మెయిల్‌లో ఉన్నట్లు తెలిపాయి.
Anand Subramanian: ఎన్ఎస్‌ఈ కో లొకేషన్ కుంభకోణం కేసులో ఆనంద్ సుబ్రమణియన్, చిత్రా రామకృష్ణపై గతంలో కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవల అదృశ్య యోగి వివరాలు బయటకు రావడంతో ఈ కేసును అధికారులు మళ్లీ తిరగదోడారు. ఈ కేసుకు సంబంధించి సుబ్రమణియన్‌ను ఈ నెల 19వ తేదీ నుంచి పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం గురువారం రాత్రి చెన్నైలో అతడిని అరెస్టు చేసి దిల్లీకి తరలించారు. అయితే విచారణకు ఆనంద్ సహకరించడం లేదని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలిపాయి.
సెబీ దర్యాప్తుతో..
ఎన్‌ఎస్‌ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఆనంద్ సుబ్రమణియన్‌ను నియమించడం, తిరిగి గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీ సలహాదారుగా మార్చడం వంటి విషయాల్లో పాలనాపరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఇటీవల దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులోనే ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణకు సంబంధించిన సంచలన విషయాలు బయటపడ్డాయి. హిమాలయాల్లో ఉండే ఓ ఆధ్యాత్మిక యోగి.. చిత్రపై ప్రభావం చూపించారని, ఆమెను పావులా ఉపయోగించుకుని ఎన్‌ఎస్‌ఈని ఆ యోగి నడిపించారని సెబీ గుర్తించింది. ఆ యోగి ప్రభావం వల్లే ఎలాంటి క్యాపిటల్ మార్కెట్ అనుభవం లేని వ్యక్తిని ఎన్‌ఎస్‌ఈ ఆపరేటింగ్ ఆఫీసర్, సలహాదారుగా నియమించారని సెబీ పేర్కొంది. అంతేగాక, ఎన్ఎస్‌ఈకి సంబంధించిన బిజినెస్ ప్రణాళికలు, బోర్డు అజెండా, ఆర్థిక అంచనాలు వంటి కీలక విషయాలను ఆ యోగితో చిత్ర పంచుకున్నారని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. అయితే తాను ఈ వ్యవహారంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని చిత్ర సమర్థించుకోవడం గమనార్హం. సదరు యోగిని ‘శిరోన్మణి’గా పేర్కొన్న ఆమె.. 20 ఏళ్లుగా ఆయన తన వ్యక్తిగత, వృత్తిగత అంశాల్లో మార్గనిర్దేశం చేశారని సెబీకి వివరించారు. దీంతో ఆ యోగి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే ఈ దర్యాప్తు క్రమంలో వేళ్లన్నీ ఆనంద్ సుబ్రమణియన్ వైపే చూపించడం గమనార్హం. చిత్రకు పంపిన ఒక మెయిల్‌లో సదరు యోగి తాను మనిషి రూపం ధరిస్తే.. ఆనంద్ సుబ్రమణియన్‌లా ఉండాలనుకుంటున్నట్లు రాయడం ఈ అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది. దీంతో ఈ దిశగా అధికారులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడినట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి:స్టాక్ మార్కెట్‌కు సారథి.. కానీ 'అదృశ్య' యోగి చేతిలో కీలుబొమ్మ.. ఇది ఓ 'చిత్ర' కథ!
ఎన్ఎస్ఈ 'చిత్ర'కు బిగుస్తున్న ఉచ్చు.. సీబీఐ లుక్ఔట్ నోటీసులు
'చిత్రా.. నీ కురులు సూపర్'.. బాబాజీ ఇ-మెయిళ్లు లీక్!