Highlights Of RBI Monetary Policy: కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ). బుధవారం ఈ మేరకు ప్రకటన చేసింది. రివర్స్ రెపోరేటు (3.35 శాతం)లోనూ మార్పు లేదని స్పష్టం చేసింది.
ఎంపీసీ సమీక్ష హైలైట్స్..
- వరుసగా 9వ సారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం.
- రెపోరేటును 4 శాతంగా, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా ఉంచుతున్నట్లు ప్రకటన.
- మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 4.25 శాతంగా కొనసాగింపు.
- ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 9.5శాతంగా ఉంటుందని అంచనా.
- మూడో త్రైమాసికంలో 6.6గా, నాలుగో త్రైమాసికంలో 6గా వృద్ధిరేటు అంచనా.
- వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 17.2శాతంగా అంచనా.
- భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నట్లు వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్.
- ఈ ఏడాది ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉంటుందన్న శక్తికాంత్ దాస్.
- పెట్రోల్, డీజిల్ ధరలపై తగ్గిన పన్నులతో వినిమయ గిరాకీ పుంజుకుంటుందన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్.
- విదేశీ శాఖల్లో మూలధనాన్ని నింపడానికి, లాభాలను స్వదేశానికి రప్పించడానికి బ్యాంకులకు ముందస్తు అనుమతి అవసరం లేదన్న ఆర్బీఐ గవర్నర్.
- డిజిటల్ చెల్లింపుల కోసం వినియోగదారులపై విధించే ఛార్జీలను సమీక్షించాలని ప్రతిపాదించిన ఆర్బీఐ.
- యూపీఐ పేమెంట్స్‌ను పెంచే దిశగా చర్యలు.
- ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు జరగనున్న తదుపరి ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షా సమావేశం.