దేశంలో కార్లపై విధిస్తున్న అధిక సుంకాలు, పన్నుల వల్లే, అత్యధికులు కొనుగోలు చేయలేకపోతున్నారని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్.సి.భార్గవ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచంలో మరే దేశం కన్నా, మనదేశంలోనే కార్లపై పన్నులు అధికంగా ఉన్నాయని తెలిపారు. జపాన్‌లో 10 శాతం పన్ను ఉంటే, ఐరోపాలో 19 శాతం వ్యాట్ మాత్రమే ఉందని, మరే పన్నులు ఉండవన్నారు.
2025 నాటికి జీడీపీలో తయారీరంగ వాటా 25 శాతానికి చేరాలంటే, కార్ల అమ్మకాలు వేగంగా జరగాల్సి ఉందని 2019-20 వార్షిక నివేదికలో భార్గవ వివరించారు. కారు కొనుగోలు ధర పెరగడానికి తోడు రుణం పొందడం భారమైనందునే, విక్రయాలు తగ్గాయని పేర్కొన్నారు. వాహన రగంలో 50 శాతం వాటా కార్లదని, తయారీ రంగంలో 40 శాతం వాటా వాహన రంగానిదని ఆయన గుర్తు చేశారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నుంచి కొవిడ్ ప్రభావం వాహన రంగంపై పడిందని తెలిపారు.