విదేశీ సంస్థాగత మదుపుదార్ల(ఎఫ్‌ఐఐలు)కు భారత్ గమ్యస్థానంలా మారింది. బిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తూనే ఉన్నారు. ఓ వైపు పాశ్చాత్య దేశాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ ఉంటే భారత్‌లో మాత్రం కరోనా కేసుల వృద్ధి తగ్గుముఖం పడుతున్న వేళ ఇది సానుకూలాంశమే. నవంబరు నెలలో ప్రతీ రోజూ ఎఫ్‌ఐఐలు కొనుగోళ్లు చేస్తూనే వచ్చారు. ఇప్పటిదాకా భారత ఈక్విటీ మార్కెట్లో వీరు రూ.45,732 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు. గత రెండు దశాబ్దాలలోనే ఇది రికార్డు నెలవారీ కొనుగోళ్లు కావటం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరంలో నికరంగా ఎఫ్‌ఐఐలు రూ.1.34 లక్షల కోట్ల పెట్టుబడులు మన మార్కెట్లోకి తీసుకువచ్చారు.
ఇవీ కారణాలు..
*అమెరికాలో ఎన్నికల అనంతరం డాలరు బలహీనపడడంతో ఈ పెట్టుబడులు మరింత పెరిగాయని చెప్పవచ్చు.
* పలు దేశాల కేంద్ర బ్యాంకులు లక్షల కోట్ల డాలర్ల విలువైన ఉద్దీపనలను ప్రకటిస్తాయన్న అంచనాలు మరో ప్రధాన కారణం. వృద్ధిని కొనసాగించేందు కోసం అమెరికా త్వరలోనే రెండో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తుందన్న అంచనాలున్నాయి. అయితే రిపబ్లికన్లు, డెమొక్రటిక్ పార్టీల మధ్య చర్చల నేపథ్యంలో ఇది కొంత ఆలస్యం కావొచ్చు.
*భారత ఆర్థిక వ్యవస్థ సైతం పుంజుకుంటోంది. రెండో అర్థభాగం(2020-21)లో సానుకూల వృద్ధిని, 2021-22లో బలమైన వృద్ధిని నమోదు చేస్తుందన్న అంచనాలున్నాయి. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీలు అంచనాలను మించి ఆర్థిక ఫలితాలను ప్రకటించడం కూడా సానుకూలాంశమే.
70 శాతం లాభాలు..
ఎఫ్‌ఐఐల పెట్టుబడుల కారణంగా మార్చి 23 నాటి కనిష్ఠాల నుంచి సూచీలు 70 శాతం మేర లాభాలను పొందాయి. మధ్య స్థాయి సూచీలు 73%, చిన్న స్థాయి సూచీలు 83 శాతం మేర రాణించాయి. తొలుత ఐటీ, ఫార్మా, విద్యుత్ షేర్లు ర్యాలీలో ముందుండి నడిపించగా గత కొద్ది వారాలుగా బ్యాంకింగ్, ఆర్థిక, మౌలిక, లోహ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు ఆ పని చేస్తున్నాయి. కాగా, మ్యూచువల్ ఫండ్‌లు మాత్రం ఈ ర్యాలీ నుంచి ప్రయోజనాన్ని పొందాలని భావించాయి. నవంబరులో ఇప్పటిదాకా డీఐఐలు రూ.32,600 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు. ఆరు నెలల్లో రూ.52,000 కోట్ల వరకు అమ్మకాలు జరిపారు.