సాధారణంగా కొత్తగా బ్యాంకు ఖాతా, డీమ్యాట్ ఖాతాలను తెరిచేటప్పుడు, మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు చేసేప్పుడు లేదా కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు మీ పాన్(శాశ్వత ఖాతా సంఖ్య) కార్డును అడుగుతారు. కొన్ని సందర్భాలలో కేవలం పాన్ నెంబరు చెప్తే సరిపోతుంది. మరికొన్ని సంస్థలకు పాన్ జిరాక్స్ కాపీ లేదా సాఫ్ట్ కాపీని ఇవ్వాల్సి వస్తుంది.
ఆదాయపు పన్ను శాఖ ఎన్‌ఎస్‌డీఎల్ లేదా యుటీఐ ద్వారా భౌతికంగా, ఎలక్ట్రానిక్ రూపాలలో 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ నెంబరుతో కూడిన కార్డును జారీ చేస్తుంది. ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటీఆర్) దాఖలు చేసేందుకు పాన్ కార్డు తప్పనిసరి. అందువల్ల ఆదాయపు పన్ను శాఖ ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైన పాన్ నెంబరును కేటాయిస్తుంది. అంతే కాకుండా అనేక లావాదేవీలలో ఇది గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.
పన్ను చెల్లింపుదారులతో పాటు పాన్ కార్డు హోల్డర్ల పూర్తి డేటాబేస్ ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉంటుంది. పాన్ వివరాలు సరైనవా…కావా… అనే సమాచారాన్ని తెలుసుకునేందుకు వ్యక్తులకు, కంపెనీలు, ఏజెంట్లు, బ్యాంకులకు ఆదాయపు పన్ను శాఖ అనుమతిస్తుంది. పాన్ కార్డ్ నకిలీదా? కాదా ?అని తెలుసుకోవడానికి ఇది అందరికీ సహాయపడుతుంది.
పాన్ కార్డు ప్రామాణికతను ఆదాయపు పన్ను వెబ్‌సైట్ ద్వారా ధ్రువీకరించుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైల్లింగ్ పోర్టల్‌కి వెళ్ళి కుడివైపున ఉన్న "వెరిఫై యువర్ పాన్ డీటైల్స్"పై క్లిక్ చేయాలి. ఇందులో పాన్ కార్డు నెంబరు, పాన్ కార్డు హోల్డర్ పేరు, అతను లేదా ఆమె పుట్టిన తేదీ, స్థితి వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు పోర్టల్‌లో మీరు చెప్పిన వివరాలు, పాన్ కార్డు నెంబరుతో సరిపోయిందీ… లేనిదీ … వెబ్‌సైట్‌లో తెలుస్తుంది.
ఎక్కువ సంఖ్యలో పాన్ కార్డులను ధ్రువీకరించాల్సిన బ్యాంకులు, కార్యాలయాలు లేదా ప్రభుత్వ సంస్థలు వంటివి ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తమను బల్క్ పాన్ వెరిఫికేషన్ ఏజెన్సీగా నమోదు చేసుకుంటాయి. తరువాత పాన్ క్వయిరీపై క్లిక్ చేసి నిర్ధిష్ట ఫార్మెట్‌లో అప్‌లోడ్ పాన్ వివరాలు తెలుసుకుంటాయి.