కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. అనుకోని అనారోగ్యం సోకినప్పుడు, చికిత్స కోసం మన కష్టార్జితం కరిగిపోకుండా ముందే జాగ్రత్త తీసుకోవాలి. దీనికోసం ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొవిడ్-19 నేపథ్యంలో ఈ పాలసీలను ఎంచుకునేటప్పుడు ప్రధానంగా గమనించాల్సిన అంశాలేమిటో తెలుసుకుందాం.
అన్ని ఖర్చులనూ భరించేలా..
కేవలం ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రమే పరిహారం ఇచ్చేలా కాకుండా.. చికిత్స సమయంలో అయ్యే అన్ని ఖర్చులనూ చెల్లించేలా పాలసీ ఉండాలి. ఔషధాల బిల్లులు, ఔట్ పేషెంట్ చికిత్స, ఇతర వ్యయాలనూ కలిపి చెల్లించే ఏర్పాటు ఉండాలి. అంతేకాకుండా.. భవిష్యత్తులో పెరిగే చికిత్స ఖర్చులను దృష్టిలో పెట్టుకొని, అందుకు అనుగుణంగా పాలసీ మొత్తం పెరిగే వీలూ ఉండాలి.
ఎక్కడైనా వర్తించేలా..
జాతీయం, అంతర్జాతీయం అనే తేడాలు లేవిప్పుడు.. నాణ్యమైన వైద్యం కోసం ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తున్నారు. కాబట్టి, మీరు ఎంచుకునే పాలసీలో అంతర్జాతీయంగానూ కవరేజీ ఉండాలి. గ్లోబల్ కవర్ పేరుతో అందిస్తున్న ఈ పాలసీల్లో అన్ని రకాల వ్యాధులు, అత్యవసర చికిత్స, ఓపీడీ, ప్రయాణ ఖర్చులు.. ఇలా అన్నింటికీ వర్తించేలా పాలసీ ఎంచుకోవాలి.
సూపర్ టాపప్‌లతో..
ఇప్పటికే ఉన్న పాలసీ మొత్తాన్ని పెంచుకోవాలంటే.. కొత్త పాలసీని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రాథమిక పాలసీకి అనుబంధంగా సూపర్ టాపప్ పాలసీలను ఎంచుకుంటే సరిపోతుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ లభించాలనుకున్నప్పుడు వీటిని తీసుకోవాలి. కొత్తగా మరో ఆరోగ్య బీమాను తీసుకున్నప్పుడు అధిక ప్రీమియం ఉంటుంది. అదే సూపర్ టాపప్ పాలసీలను కొనుగోలు చేసినప్పుడు ప్రాథమిక మినహాయింపును నిర్ణయించుకొని, దానికి తగ్గట్టుగా పాలసీని తీసుకోవచ్చు. అందువల్ల ప్రీమియం భారీగా ఉండదు.
తీవ్ర వ్యాధులకు..
కేన్సర్, గుండె జబ్బులు, డయాబెటీస్‌లాంటి వ్యాధుల బారిన ఎంతోమంది పడుతున్నారు. ఏదైనా తీవ్ర వ్యాధిని గుర్తించినప్పుడు చికిత్సతో సంబంధం లేకుండా పరిహారాన్ని ఇచ్చే విధంగా క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. మీ వార్షికాదాయానికి కనీసం 10 రెట్ల వరకూ ఈ క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఉండేలా చూసుకోండి. వ్యాధిని గుర్తించగానే ఒకేసారి పరిహారం ఇస్తారా? వాయిదాల్లో చెల్లిస్తారా? అనే అంశాన్నీ చూసుకోవాలి. కొన్ని పాలసీల్లో కొన్ని నెలలపాటు ఆదాయంలా అందించే ఏర్పాటూ ఉంటుంది. ఆదాయం ఆగిపోయిన సందర్భాల్లో ఈ పాలసీలు ప్రయోజనం.
వేటికి వర్తించదు..
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం.. వర్తించని అంశాలేమిటన్నది. వేచి ఉండే సమయం, ఏయే వ్యాధులకు వర్తించదులాంటివి ముందే అడిగి తెలుసుకోవాలి. తీరా క్లెయిం చేసుకున్నాక తిరస్కరిస్తే.. ఇబ్బందులు తప్పవు.
వివరాలు దాచొద్దు..
పాలసీ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు మీ ఆరోగ్య వివరాలు, ఆహార అలవాట్ల గురించి ఎలాంటి దాపరికం ఉండకూడదు. పాలసీదారుడు పూర్తి వివరాలు తెలియజేయకపోతే.. బీమా సంస్థ క్లెయింలను తిరస్కరించేందుకు ఆస్కారం ఉంది. ఈ విషయంలో పాలసీదారుడు పారదర్శకంగా ఉండటమే మేలు.
ప్రీమియం తక్కువగా ఉంటే.. పాలసీని ఎంచుకునేటప్పుడు అది అందించే ప్రయోజనాలను చూడాలి. అంతేకానీ.. ప్రీమియం తక్కువగా ఉందని ఏదో ఒక పాలసీని ఎంచుకుంటే.. అంతిమంగా క్లెయింల సందర్భంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా సహ- చెల్లింపు, గది అద్దె, ఐసీయూ ఖర్చులపై పరిమితిలాంటి నిబంధనలు ఉండకూదు. రెండు ఆరోగ్య బీమా పాలసీలను పోల్చేటప్పుడు కేవలం ప్రీమియం ధరలనే చూడొద్దు. అవి అందించే ప్రయోజనాలను తెలుసుకోవాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. దీంతోపాటు లాయల్టీ బోనస్, నోక్లెయిం బోనస్, ఆరోగ్యాన్ని కాపాడుకునే వారికి అదనపు రాయితీల్లాంటివీ చూడాలి.
- శశాంక్ చఫేకర్, చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్, మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్
ఇదీ చూడండి:టర్మ్ పాలసీల ప్రీమియం మరింత ప్రియం!