Health Insurance India: ఆరోగ్య బీమాపై చాలా మందికి అనేక అపోహలు ఉంటాయి. ఏ వయసులో బీమా తీసుకోవాలి? ఆస్పత్రిలో ఎన్ని రోజులు ఉంటే బీమా వర్తిస్తుంది? ఇలాంటి అనేక సందేహాలపై సమాధానాలు మీకోసం.
అపోహ: చిన్న వయసులో అనవసరం.
వాస్తవం: చిన్న వయసులో ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు తక్కువగానే ఉంటాయి. అంతమాత్రాన పూర్తిగా బీమాను విస్మరించలేం. ఈ వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియమూ తక్కువగానే ఉంటుంది. ఇక్కడ మరో విషయమా గమనించాలి. ఆరోగ్య బీమా తీసుకున్న వెంటనే అన్ని రోగాలకూ రక్షణ లభించదు. కొంతకాలం వేచి ఉండాలి. కొన్ని వ్యాధులకు ఇది 2-4 ఏళ్ల పాటు ఉంటుంది. అందుకే వీలైనంత తొందరగా పాలసీ తీసుకుంటే ఇలా వేచి ఉండే వ్యవధితో ఇబ్బంది ఉండదు. కాబట్టి, చిన్న వయసులో ఆరోగ్య బీమా అనవసరం అనే ఆలోచన విడిచి పెట్టాలి.
అపోహ: ఆసుపత్రిలో తప్పనిసరిగా 24 గంటలు ఉంటేనే పరిహారం వస్తుంది.
వాస్తవం:వైద్య చికిత్స పద్ధతులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఆధునిక చికిత్సలో శస్త్రచికిత్సలు, కొన్ని రకాల ఆపరేషన్లకు ఎక్కువ సమయం పట్టడం లేదు. అదే పూట ఇంటికి వెళ్లిపోవచ్చు. గతంలో తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉండేది. కానీ, ఇప్పుడు బీమా సంస్థలు డే కేర్ చికిత్సలకూ అనుమతినిస్తున్నాయి.
కీమోథెరపీ, డయాలసిస్, కంటి శస్త్ర చికిత్స, రేడియోథెరపీ తదితర చికిత్సలకూ పరిహారం లభిస్తుంది. కొన్ని నిబంధనల మేరకు దంత చికిత్సలకూ పరిహారం లభిస్తుంది. కాబట్టి, పాలసీ తీసుకునేటప్పుడు నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. వేటికి పరిహారం వర్తిస్తుంది. వేటికి వర్తించదు అనేది ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి.
అపోహ: బృంద బీమా సరిపోతుంది.
వాస్తవం: యాజమాన్యాలు తమ ఉద్యోగుల సంక్షేమం కోసం బృంద ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ కార్పొరేట్ పాలసీలతో కొన్ని పరిమిత లాభాలుంటాయి. కొన్నిసార్లు ఇది పూర్తిగా సరిపోకపోవచ్చు. ఉద్యోగం మానేసినప్పుడు ఈ బృంద బీమా వర్తించదు. కాబట్టి, ఈ కార్పొరేట్ పాలసీకి తోడుగా.. సొంతంగా కుటుంబానికి అంతటికీ వర్తించే ఆరోగ్య బీమా తీసుకోవడం మర్చిపోవద్దు. వయసు పెరిగిన తర్వాత ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో కొన్నిసార్లు ముందస్తు వ్యాధుల చికిత్సకు కొంతకాలం వేచి ఉండాల్సి రావచ్చు. ఇది కొన్ని సందర్భాల్లో తీవ్ర ఇబ్బందులకు కారణమవుతుంది.