తెలంగాణ

telangana

ETV Bharat / business

పెద్దలకు ఆరోగ్య బీమా.. ఈ జాగ్రత్తలు తీసుకున్నారా!

Health insurance: ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ, ఆరోగ్యం కోసం కొంత ఖర్చు పెట్టక తప్పదు. ఏటా వైద్య ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీన్ని తట్టుకోవాలంటే.. ఆరోగ్య బీమా పాలసీలు ఒక తప్పనిసరి అవసరంగా మారాయి. పదవీ విరమణ చేసిన తర్వాత ఈ పాలసీ లేకుంటే.. అప్పటివరకు ఉన్న పొదుపు మొత్తాన్నంతా ఒక్క అనారోగ్యం హరించి వేస్తుంది. అందుకే, పెద్దలు (సీనియర్‌ సిటిజన్లు) ఆరోగ్య బీమాను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దు. 60 ఏళ్లు దాటిన వారు ఈ పాలసీని తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది తెలుసుకుందాం.

Health insurance for senior citizens
Health insurance for senior citizens

By

Published : Mar 2, 2022, 2:21 PM IST

Health Insurance for Senior Citizens: సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారికి కొత్త పాలసీలు ఇచ్చేందుకు బీమా సంస్థలు అనేక నిబంధనలను పాటిస్తాయి. ముందస్తు వ్యాధులు ఉంటే పాలసీ రావడం కొన్నిసార్లు కష్టమే. కాబట్టి, ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా పాలసీని సకాలంలో పునరుద్ధరించుకోవడం ఎప్పుడూ మంచిది. కొన్ని బీమా సంస్థలు నిర్ణీత వయసు దాటిన తర్వాత పాలసీలనూ ఇవ్వడం లేదు. పునరుద్ధరణపైనా గరిష్ఠ వయో పరిమితిని విధించాయి. పాలసీని ఎంచుకునేటప్పుడు జీవితాంతం వరకూ పునరుద్ధరణకు అనుమతినిచ్చే పాలసీలను పరిశీలించాలి. ఆరోగ్య బీమా పాలసీల అవసరం 75-80 ఏళ్ల వయసులో అధికంగా ఉండే అవకాశం ఉంది. పునరుద్ధరణ విషయంలో అజాగ్రత్త పనికిరాదు.

వేచి చూసే కాలమెంత?

బీమా సంస్థలు పాలసీ ఇచ్చిన తర్వాత ముందస్తు వ్యాధులతోపాటు, నిర్ణీత వ్యాధులకు వేచి ఉండే సమయాన్ని నిర్ణయిస్తాయి. ఇది సాధారణంగా 2 నుంచి 4 ఏళ్లపాటు ఉంటుంది. సీనియర్‌ సిటిజన్‌లు ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు తక్కువ వేచి ఉండే సమయం ఉండాలి. దీంతోపాటు అనారోగ్యాల జాబితా సైతం పరిమితంగా ఉండాలి. ఇలాంటి వాటినే ఎంచుకునే ప్రయత్నం చేయాలి.

మినహాయింపుల మాటేమిటి?

పాలసీ తీసుకునేటప్పుడు వేటికి వర్తిస్తుంది.. వేటికి వర్తించదు అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. కొన్నిసార్లు బీమా సంస్థ నిర్ణీత చికిత్సలకు శాశ్వతంగా క్లెయిం అంగీకరించకపోవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శాశ్వత మినహాయింపుల జాబితాను తనిఖీ చేయాలి. తీరా క్లెయిం చేశాక నిరాకరిస్తే.. ఇబ్బందులు తప్పవు.

సహ చెల్లింపు సంగతి..

పెద్దలకు పాలసీలను అందించినప్పటికీ.. బీమా సంస్థలు కొన్ని నిబంధనలను అమలు చేస్తుంటాయి. ఇందులో ప్రధానంగా సహ చెల్లింపు ఒకటి. మొత్తం చికిత్స ఖర్చులో పాలసీదారుడు ఎంతోకొంత భరించాల్సి ఉంటుంది. ఇదే సహ చెల్లింపు (కో-పేమెంట్‌). పాలసీని ఎంచుకునేటప్పుడు తక్కువ సహ చెల్లింపు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకూ ఈ నిబంధన లేని పాలసీని తీసుకోవాలి. కాస్త ప్రీమియం పెరిగినా ఇదే మేలు.

ఉప పరిమితులు ఉంటే..

కొన్ని పాలసీలు.. చికిత్స ఖర్చులపై పరిమితులు విధిస్తుంటాయి. ముఖ్యంగా ఆసుపత్రి గది అద్దె, ఐసీయూ ఛార్జీలు, శస్త్రచికిత్సలపై కొంత పరిమితి ఉంటుంది. వీటికోసం పాలసీ మొత్తంలో నిర్ణీత శాతాన్నే చెల్లిస్తుంటాయి. ఉదాహరణకు రూ.5లక్షల పాలసీ ఉంటే.. గది అద్దె పాలసీ విలువలో 1 శాతం మేరకే చెల్లిస్తామని చెప్పొచ్చు. అంటే, రూ.5,000. అంతకుమించితే పాలసీదారుడు భరించాలి. పెద్దలు ఈ పాలసీలను ఎంచుకునేటప్పుడు ఈ నిబంధన గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

వైద్య పరీక్షలకు అవకాశం..

పెద్ద వయసు వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు అవసరం. కొన్ని బీమా సంస్థలు ఏడాదిలో ఎలాంటి క్లెయిం లేకపోతే.. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తాయి. వీటికోసం చెల్లించిన ఖర్చులను తిరిగి ఇస్తాయి. సీనియర్‌ సిటిజన్లు ఇలాంటి వెసులుబాటును అందిస్తున్న పాలసీలనే ఎంచుకోవాలి.

నో క్లెయిం బోనస్‌ ఉందా?

ఒక ఏడాదిలో ఎలాంటి క్లెయిములూ లేకపోతే ఆ పాలసీకి నోక్లెయిం బోనస్‌ (ఎన్‌సీబీ) లభిస్తుంది. ప్రీమియం తగ్గించడం లేదా.. పాలసీ విలువను 10-100 శాతం వరకూ పెంచడంలాంటి ప్రయోజనాలు అందుతాయి. ఎన్‌సీబీ ప్రయోజనాలను ఎలా అందిస్తున్నారు.. ప్రీమియం తగ్గింపు కన్నా.. పాలసీ విలువ పెంచుకునేందుకు అవకాశం ఉందా లాంటివి పరిశీలించాలి.

వీటితోపాటు తీవ్రమైన అనారోగ్యం, మానసిక రగ్మతలు, ఆయుష్‌ చికిత్స బిల్లులు చెల్లించడం వంటి వాటికీ పాలసీ వర్తించాలి. కొన్ని కంపెనీలు 60 ఏళ్లప్పుడు ప్రీమియం తక్కువగానే వసూలు చేయొచ్చు. కానీ, వయసు పెరుగుతున్న కొద్దీ ప్రీమియాన్ని అధికం చేస్తుంటాయి. ముందుగానే వివిధ వయసుల వారికి ప్రీమియం ఎలా ఉందో చూసుకున్నాకే, పాలసీ కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి.

ఇవీ చూడండి:బంగారం రుణానికి.. నామినీ ఎందుకంటే?

మండుతున్న చమురు ధరలు.. భారత్​లో ఇక పెట్రోల్​ రేట్ల మోతే!

'ఎల్ఐసీ ఐపీఓ ఇప్పట్లో కష్టమే'- కారణం ఇదే!

ABOUT THE AUTHOR

...view details