తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరోగ్య.. ఉపాధి సంక్షోభం! ఎక్కడికక్కడ అలుముకొన్న స్తబ్ధత

ప్రాణాంతక కరోనా ఆరోగ్యపరమైన సమస్యే అనుకుంటే పొరపాటే. ఆర్థికంగానూ తీవ్ర సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మనిషి జీవించడానికి ప్రాణాలు ఎంత అవసరమో.. జీవన ఉపాధి అంతే అవసరం. లాక్​డౌన్​ ఇప్పటికే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అయితే ఆర్థిక వ్యవస్థ, జీవనోపాధికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోతాయా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు?

Health and employment crisis-Confronting the virus is essential
ఆరోగ్య,ఉపాధి సంక్షోభం.. వైరస్​ను ఎదుర్కోవడం అవశ్యకం

By

Published : Apr 5, 2020, 7:46 AM IST

కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. 21 రోజుల లాక్‌డౌన్‌ ఇప్పటికే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఆరోగ్యం, జీవనోపాధి ప్రభావితం కానున్నాయి. ఇక్కడ ప్రాణాలు, జీవనోపాధి రెండూ ముఖ్యమేనన్న సంగతిని గుర్తించాలి. లాక్‌డౌన్‌ సందర్భంగా, ఆ తరవాతి కాలంలో ఎదురయ్యే పరిణామాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంది. ఆర్థిక వ్యవస్థ, జీవనోపాధికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోతాయా లేదా అనేదీ విశ్లేషించాలి. లాక్‌డౌన్‌ ఫలితంగా కొవిడ్‌-19 సామాజికంగా విస్తరించడాన్ని అరికట్టి, ఆరోగ్య సంక్షోభాన్ని తగ్గించవచ్చు. వైరస్‌ ఎక్కువమందికి వ్యాపించకముందే ఈ నిర్బంధ నిబంధన అమలయింది. ఒకసారి లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే, వైరస్‌ చాలా వేగంగా వ్యాపించే ప్రమాదమూ ఉంది. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఎదురైన అనుభవాలూ మనకు తోడ్పడతాయి.

చైనానే ఉదాహరణ

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరవాత ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి చైనాను ఉదాహరణగా తీసుకోవచ్చు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరవాత గత కొద్ది రోజులుగా చైనాలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. ఏదేమైనా, ప్రస్తుత లాక్‌డౌన్‌ కాలం మనకు ఎంతో ఉపయోగకరం. ఈ సమయంలో సరైన ప్రణాళికను రూపొందించుకునే అవకాశం దక్కింది. రాబోయే కొద్ది వారాల్లో రుగ్మతల సంఖ్యను తగ్గించుకునే అవకాశం వచ్చింది. ప్రస్తుత సమయంలో పరీక్షా కేంద్రాలు, కిట్లు, వెంటిలేటర్లు, ఆస్పత్రుల్లో పడకలు తదితర ఆరోగ్యపరమైన మౌలిక సదుపాయాల్ని పెంచేందుకు పలు రకాల చర్యలు తీసుకోవాల్సి ఉంది. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు మూడు అంశాలు చాలా ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అవి 1.పరీక్ష, 2.పరీక్ష, 3.పరీక్ష అని పేర్కొంది. దీన్నిబట్టి కరోనా నిర్ధారణ పరీక్షలకు ఉన్న ప్రాధాన్యం బోధపడుతుంది.

రోగులకు చికిత్స అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని హేళనగా చూడాల్సిన అవసరం లేదు. వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బందిని కాపాడుకోవాలి. ఈ పరిస్థితుల్లో వారే కథానాయకులన్న సంగతి మరవకూడదు.

ప్రైవేటుకూ భాగస్వామ్యం అవసరం

కరోనా వైరస్‌ గ్రామీణ ప్రాంతాలకు వ్యాపిస్తే, దాన్ని గుర్తించి సకాలంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే ఏర్పాట్లు అవసరం. సంబంధిత నివేదికల్ని వేగంగా సేకరించి, సమస్య ఎక్కడ తీవ్రంగా ఉందో గుర్తించాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ కాలంలోనూ, ఆ తరవాతా ఆరోగ్య సౌకర్యాల అవసరం భారీగా ఉండవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మౌలిక సదుపాయాలు సరిపోకపోతే, ప్రైవేటు రంగాన్ని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వాలు అనుమతించాల్సి ఉంటుంది. అదృష్టవశాత్తు ప్రభుత్వం, కార్పొరేట్‌, ప్రైవేటు రంగం, పౌర సమాజం అన్నీ దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాల్ని పెంచేందుకు ముందుకు వస్తున్నాయి. అసంఘటిత రంగంలోని ప్రజలను దృష్టిలో పెట్టుకుని చూస్తే- లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడం, భౌతిక దూరం పాటించడం కొంతమేర కష్టమైన విషయమే. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామాలవైపు సాగుతున్న వలస కార్మికుల వ్యధల్ని మనం చూస్తూనే ఉన్నాం. వారంతా సామాజిక దూరం వంటి పద్ధతుల్ని ఏమాత్రం పాటించడం లేదు. ముంబయి మురికివాడల వంటిచోట్ల ఒక చిన్న గదిలో అయిదు నుంచి పది మందిదాకా నివసిస్తుంటారు. జనసాంద్రత అత్యధికంగా ఉండే చోట్లలో భౌతిక దూరాన్ని పాటించడం చాలా కష్టమవుతుంది.

లాక్​డౌన్ పొడిగించకూడదు!

ప్రజల ఆదాయాలు, జీవనోపాధి విషయానికొస్తే... ప్రస్తుత పరిస్థితిలో తలెత్తిన అసౌకర్యానికి ప్రధానమంత్రి దేశవాసులకు క్షమాపణలు చెప్పారు. ఆరోగ్య సంక్షోభాన్ని తగ్గించడంలో లాక్‌డౌన్‌ ముఖ్యమైనదన్న సంగతిని గుర్తించాలి. అయితే, ప్రజల జీవనోపాధి అవకాశాలపై ప్రభావం చూపే అంశాలెన్నో ఉన్నాయి. లాక్‌డౌన్‌ను ఇంతకన్నా ముందుకు పొడిగించకూడదని చాలామంది ఆర్థికవేత్తలు, ఇతర విశ్లేషకులు సూచిస్తున్నారు. అలా పొడిగిస్తే ఆకలి చావులు చోటుచేసుకుంటాయని, అవి కరోనా వైరస్‌ సంబంధిత మరణాలకన్నా ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. భారత్‌లో పెద్దయెత్తున జనాభా, భారీ సంఖ్యలో శ్రామికులు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఏడాది మనకు రికార్డు స్థాయిలో 29.2 కోట్ల టన్నుల ఆహార ధాన్యం, ఉద్యానవనాల ఉత్పత్తులు వస్తాయని అంచనా. మహమ్మారి విజృంభించడానికి ముందు ఈసారి రబీలో చక్కని పంటల ఉత్పత్తి ఉంటుందనే అంచనా వేశారు. కానీ, లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని రకాల వ్యవసాయ పనులకు సరఫరా వ్యవస్థకూ అంతరాయం తలెత్తింది. లాక్‌డౌన్‌ కాలంలో, ఆ తరవాత పెట్టుబడి పంపిణీ, కోత, రవాణా, వ్యవసాయ మార్కెట్లు వంటి పలు అంశాల్లో అంతరాయాలు తలెత్తాయి. కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పలు వర్గాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఇచ్చింది.

ధరలు క్షీణత..

వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే శ్రామికులు, రైతులు, వ్యవసాయోత్పత్తుల్ని సేకరించే ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన మండీలు, పంటకోత, విత్తనాలు వేసే యంత్రాల తరలింపు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ప్యాకేజింగ్‌ కేంద్రాలకు మినహాయింపులు వర్తిస్తాయి. కానీ, ఇలాంటి మార్గదర్శకాలను దేశంలోని చాలాచోట్ల పాటించడం లేదు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ మండీలను చాలా రాష్ట్రాల్లో మూసివేయడంతో రైతులు తమ ఉత్పత్తుల్ని సకాలంలో విక్రయించలేకపోతున్నారు. ధరలూ దారుణంగా పడిపోయాయి. కొందరైతే సగం ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. ఉత్పత్తుల్ని సేకరించేందుకు రవాణాపరమైన అడ్డంకులు ఉండటంతో వ్యాపారులు వెనకంజ వేసిన కారణంగానే ఈ సమస్య తలెత్తింది. పరిస్థితులు మరింతగా విషమిస్తే, రైతులు తమ పంటల్ని పొలాల్లోనే విడిచి పెట్టాల్సిన ముప్పూ పొంచి ఉంది. మరోవైపు నగరాల్లోని వినియోగదారులు సరకులు కొనాలంటే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సరఫరా వ్యవస్థలోని అడ్డంకులు ఉత్పత్తి నష్టాలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ కార్యకలాపాల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అత్యవసరంగా పంటకోత అనంతర కార్యకలాపాలు, టోకు, చిల్లర వర్తక మార్కెట్లు, నిల్వ, రవాణా వంటి అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

రైతులకు అండగా నిలవాలి!

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మద్దతు ధర అందిస్తూ పంట ఉత్పత్తులను సేకరించే కార్యకలాపాలు కీలకంగా మారతాయి. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం వరి సేకరణకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లోని సేకరణ కేంద్రాల్లో గుంపుల్ని తగ్గించేందుకు వేర్వేరు సమయాల్లో సేకరించాలని నిర్ణయించింది. ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి పలు రాష్ట్రాలు గ్రామస్థాయిలో వికేంద్రీకృత పద్ధతిలో సేకరణ చేపట్టగల సామర్థ్యాన్ని సముపార్జించుకున్నాయి. స్వయం సహాయక బృందాలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల సహాయంతో రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టవచ్చు. ఉపయోగించని గిడ్డంగులు, శీతల గిడ్డంగులను గుర్తించి ఉత్పత్తులు అమ్ముకోకుండా దాచుకోవాలనుకునే రైతులకు అందించి అండగా నిలవాలి. అయితే, నిల్వ చేసే విషయంలో పరిశుభ్రతకు సంబంధించిన మార్గదర్శకాల్ని పాటించాలి. ఇలాంటి చోట్ల పనిచేసే సిబ్బంది రక్షణ చర్యలు పాటించాలి.

వారు సురక్షితంగా ఉండేలా చూడాలి!

పంట, సరఫరా గొలుసు వ్యవస్థతో సంబంధం ఉండేవారు మహమ్మారి బారిన పడకుండా సురక్షితంగా వ్యవహరించాలి. గ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులను వారి మానాన వారిని వదిలేయకుండా పరీక్షలు చేపట్టాల్సి ఉంటుంది. ఆహార, వ్యవసాయ సరఫరా గొలుసు వ్యవస్థల్ని తిరిగి గాడిన పడేయడం ప్రభుత్వానికి పెద్దగా కష్టమైన విషయమేమీ కాదు. లాక్‌డౌన్‌ తరవాత తలెత్తే ఆరోగ్య, జీవనోపాధి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే కృషిచేయాలి. లాక్‌డౌన్‌ తరవాత మహమ్మారి మరింతగా విజృంభిస్తే, ఎదుర్కొనేందుకు వీలుగా మనం ఇప్పుడే ఆరోగ్య రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాల్ని పెంపొందించుకోవాల్సి ఉంది. ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజీ సరిపోకపోవచ్చు. ఇది- భారత్‌కు మునుపెన్నడూ ఎదురుకాని పరిస్థితే అయినా- మశూచి, ప్లేగు, పోలియో వంటి సమస్యలపై పోరాడి గెలిచిన అనుభవం మనకుంది. ప్రస్తుత సంక్షోభాన్ని సైతం సాధ్యమైనంత త్వరగానే అధిగమించగలమని విశ్వసిద్దాం.

పేదలపై పెను ప్రభావం

అసంఘటిత రంగంలోని కార్మికులపై కొవిడ్‌-19 తీవ్ర ప్రభావం చూపుతోంది. వలస కూలీల విషయంలో ముందస్తు కసరత్తు, సంసిద్ధత లేకుండానే లాక్‌డౌన్‌ను ప్రకటించారు. లాక్‌డౌన్‌ బాధితుల కోసం ప్రభుత్వం రూ.1.7లక్షల కోట్లు కేటాయించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్పొరేట్‌ రంగాల కోసం మరికొన్ని చర్యలు ప్రకటించనుంది. వాస్తవిక సమస్యతో పోలిస్తే ఇది చిన్నమొత్తమని చాలామంది ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు నోబెల్‌ పురస్కారం పొందిన ఆర్థికవేత్తలు అభిజిత్‌ బెనర్జీ, ఎస్తేర్‌ డఫ్లోలు ఒక వ్యాసంలో పేర్కొన్న ప్రకారం ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న సహాయం చాలా తక్కువ. శ్రామికులు పనులు వెతుక్కుంటూ బయటికి వెళ్లి, వైరస్‌ వ్యాప్తికి కారణం కాకూడదంటే ఖర్చు పెట్టాల్సిన మొత్తం ఎక్కువగా ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. అమెరికా రెండు లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. అమెరికా తదుపరి ఉద్దీపన ప్యాకేజీ సైతం భారీగా ఉండొచ్చని అంచనా.

పేదలపై పెను ప్రభావం

అంతకు మించి!

2008లో మహా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పటికంటే ప్రస్తుత ఉద్దీపన ప్యాకేజీ రెండురెట్లు ఉండాలని చాలామంది ఆశిస్తున్నారు. మరోమాటలో చెప్పాలంటే, అమెరికా ఉద్దీపన భారత్‌కన్నా పదిరెట్లు ఎక్కువగా ఉంటోంది. ఐరోపాలోని చాలా దేశాలు భారీగానే వ్యయం చేస్తున్నాయి. భారత్‌కు సంబంధించి ప్రస్తుత ఉద్దీపన కన్నా మూడు నుంచి నాలుగురెట్లు అధికంగా వ్యయం చేయాల్సి ఉంది. ఆరోగ్యం, ఆదాయాలు, జీవనోపాధి పరంగా నష్టాలు వాటిల్లినందున సుమారు ఏడు లక్షల కోట్ల నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల వరకు ఉద్దీపన ప్యాకేజీగా వ్యయం చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మహిళల జన్‌ధన్‌ ఖాతాల్లో మూడు నెలలపాటు నెలకు రూ.500 ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఆ ఖాతాల్లో వచ్చే మూడు నెలల్లో- నెలకు కనీసం మూడు వేల రూపాయలు వేయాల్సిన అవసరం ఉంది. దీనికి అదనంగా, అసంఘటిత రంగంలోని పేద కార్మికులు, బాధిత సమూహాలు, అవసరం ఉన్నవారికి ఆహార సరఫరా చేయాలి.

-ఎస్​. మహేంద్ర దేవ్​, ముంబయిలోని ఐజీఐడీఆర్​ ఉప కులపతి

ఇదీ చూడండి: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- 30 శాతం వారివే

ABOUT THE AUTHOR

...view details