తెలంగాణ

telangana

ETV Bharat / business

'మహిళలు అందుకు సమయం కేటాయించడం తప్పనిసరి!' - జీవిత బీమా

Health and Life Insurance: మహిళలు తప్పనిసరిగా జీవిత, ఆరోగ్య బీమా పాలసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ ఇన్యూరెన్స్​ ఎండీ, సీఈఓ విభా పదాల్కర్. కొవిడ్​ ప్రభావంతో చాలా మంది ఆర్థిక రక్షణపై దృష్టి సారించడం ప్రారంభించారని పేర్కొన్నారు.

Life Insurance
పాలసీ

By

Published : Mar 6, 2022, 7:18 AM IST

Health and Life Insurances: 'జీవితంలోని ప్రతి దశలోనూ ఆర్థికంగా భరోసా కల్పించే ఏర్పాట్లు చేసుకోవాలి. సంపాదన మొదలైనప్పటి నుంచీ.. పదవీ విరమణ దాకా అనిశ్చితి వెంటాడుతూనే ఉంటుంది. దీనికి సిద్ధంగా ఉండాలి. కొవిడ్‌ తర్వాత బీమా విస్తృతి బాగా పెరిగింది' అని అంటున్నారు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ విభా పదాల్కర్‌. డిజిటలీకరణ బీమా రంగాన్ని సమూలంగా మార్చిందని అంటున్నారామె. మహిళలు తప్పనిసరిగా జీవిత, ఆరోగ్య బీమా పాలసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఇంటర్వ్యూ విశేషాలు..

కొవిడ్‌ మహమ్మారి నుంచి బీమా సంస్థలు, పాలసీదారులు నేర్చుకున్న పాఠాలేమిటి ?

ఆర్థిక భయం అనే సూత్రం ఆధారంగానే బీమా పనిచేస్తుంది. మహమ్మారి వంటి సంఘటనలు ప్రతి ఒక్కరిలోనూ ఆర్థికంగా రక్షణ ఉండాలనే ఆలోచనను రేకెత్తిస్తుంటాయి. కొవిడ్‌ నేపథ్యంలో చాలామంది నేర్చుకున్న పాఠమిదే. సొంతంగా, కుటుంబానికి ఆర్థిక భద్రత ప్రాముఖ్యత తెలిసింది. అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలుసుకున్నారు. టర్మ్‌ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా పాలసీల్లో ఒక్కసారిగా వృద్ధి కనిపించడానికి కారణం ఇదే. బీమా సంస్థలూ సంప్రదాయ పద్ధతులను వదిలి డిజిటల్‌పై దృష్టి సారించాయి. వ్యాపారాన్ని నిర్వహించేందుకు సాంకేతిక ఆధారిత పరిష్కారాలను గుర్తించి, త్వరగా అందుకున్న సంస్థలు పురోగతి సాధించాయి.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ విభా పదాల్కర్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలకు మీరేం సలహా ఇస్తారు ?

ఉద్యోగం చేస్తున్నా, గృహిణిగా ఉన్నా ప్రతి మహిళ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండటం చాలా కీలకం. మహిళలు అనేక పాత్రలు పోషిస్తారు. కుటుంబాలకు, సంస్థలకు వారెంతో కీలకం. అందుకే మహిళలు తమపై తాము దృష్టి పెట్టాలి. పదవీ విరమణ, టర్మ్‌ ఇన్సూరెన్స్, పొదుపు, పెట్టుబడి ప్రణాళికలు ఉండాలి. ఆరోగ్య, తీవ్ర వ్యాధులకు వర్తించే బీమా ఉండాలి. గృహిణిలు తమ జీవిత భాగస్వామి తగిన మొత్తానికి బీమా చేయించుకునేలా చూడాలి. కుటుంబ ఆర్థిక విషయాల్లో మహిళల నిర్ణయాలకు తప్పనిసరిగా విలువ ఉండాలి. పెట్టుబడి పథకాలను, ఆర్థిక విషయాలను అర్థం చేసుకునేందుకు కొంత సమయం కేటాయించడం ఇప్పుడు మహిళలందరికీ ఎంతో అవసరం.

టర్మ్‌ పాలసీల ధరలు ఇటీవల పెరిగాయి కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?

బీమా సంస్థలు పాలసీదారులకు అందిస్తున్న సేవలకు అనుగుణంగా ప్రీమియం ధరలను సవరిస్తున్నాయి. ముఖ్యంగా 10 ప్రధాన నగరాలను దాటి, క్రమం తప్పని ఆదాయం లేని వారికీ బీమా రక్షణ ఇవ్వడం చూస్తున్నాం. దీంతో ప్రీమియంలు కొంత మేరకు పెరిగాయి. అయినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. మన దగ్గరే ప్రీమియం చాలా తక్కువగా ఉంది. రీ ఇన్సూరెన్స్‌ సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ.. ప్రీమియం ధరలను హేతుబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. చిన్న ప్రయోజనం లభించినా దానిని పాలసీదారులకు బదిలీ చేస్తున్నాం. టర్మ్‌ పాలసీలను కొనుగోలు చేసేటప్పుడు ప్రీమియం ఒక్కటే ప్రామాణికంగా చూడకూడదు. బీమా సంస్థపై నమ్మకం, అందించే సేవలు, క్లెయిం సెటిల్‌మెంట్‌లాంటివి పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలి.

ఎక్సైడ్‌ లైఫ్‌ స్వాధీనం మీకు ఎంత మేరకు ఉపయోగపడనుంది ?

దక్షిణ భారతంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఎక్సైడ్‌ లైఫ్‌ బలంగా ఉంది. దీనికి మా బ్రాండు, డిజిటల్‌ సామర్థ్యాలు తోడవ్వడం వల్ల మరింత వేగంగా విస్తరించేందుకు వీలవుతుంది. పాలసీదారులకు మేము అందించే వినూత్న పాలసీలు, సేవలు ఎక్సైడ్‌ లైఫ్‌ వినియోగదారులకు అందుతాయి.

డిజిటలీకరణతో పాలసీదారులకు ఏ మేరకు సేవలందుతున్నాయి ?

పాలసీదారులతో అనుసంధానం పెరగడం, వారి అవసరాలను అర్థం చేసుకునే వీలు డిజిటలీకరణతో లభించింది. పాలసీల విక్రయాలు, సేవలను అందించడం సులభమయ్యింది. ఇప్పుడు 99 శాతం పాలసీల జారీ డిజిటల్‌లోనే జరుగుతోంది. 88 శాతం పాలసీదారులు డిజిటల్‌ పద్ధతుల్లోనే మమ్మల్ని సంప్రదిస్తున్నారు. 6-7 శాతం మాత్రమే శాఖల ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. 35 శాతానికి పైగా ప్రశ్నలకు మా బోట్స్‌ సమాధానం ఇస్తున్నాయి. 20 శాతం ప్రశ్నలకు వాట్సాప్‌ బోట్స్‌ ద్వారా పరిష్కారాలు లభిస్తున్నాయి.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details