గత ఆర్థిక ఏడాదిలో బ్యాంకు ఉన్నతాధికారుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పురి అధిక వేతనం అందుకున్నారు. గత 25 ఏళ్లలో ప్రైవేటు రంగంలో ఈ బ్యాంకుకు అధిక ఆస్తులు సమకూర్చడంలో, మదుపర్ల నుంచి అధిక విలువ లభించేలా చేస్తున్నారు ఆదిత్య. ఈ మేరకు ఆయనకు రూ.18.92 కోట్ల వేతనం, స్టాక్ ఆప్షన్స్ కింద మరో రూ.161.56 కోట్లు లభించాయి.
గతేడాది వివరాలు..
2018-19లో స్టాక్ ఆప్షన్స్ కింద రూ.42.20 కోట్లు, స్థూల వేతనం కింద రూ.13.65 కోట్లు అందుకున్నారు ఆదిత్య. ఇప్పటికే 70 ఏళ్లకు చేరువైన ఆదిత్య.. ఈ ఏడాది అక్టోబర్లో పదవీ విరమణ చేయనున్నారు. అయితే.. ఈయన స్థానంలో గ్రూప్ అధిపతి శశిధర్ జగ్దీశన్ నియమితులయ్యే అవకాశాలున్నాయి. జగ్దీశన్ 2019-20 ఆర్థిక ఏడాదికి గానూ రూ.2.91 కోట్ల వేతనం పొందారు.
మిగతా బ్యాంకు ఉన్నతాధికారుల వేతనాలు ఇలా..
- ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ సందీప్ భక్షి 2019-20కి స్థూల వేతనంగా రూ.6.31 కోట్లు అందుకున్నారు. 2018-19లో ఆయన రూ.4.90 కోట్లు పొందారు.
- యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ ఛౌధ్రికి రూ.6.01 కోట్లు లభించాయి.
- కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ స్థూల వేతనం రూ.2.97 కోట్లుగా నమోదైంది. 2018-19లో ఆయనకు రూ.3.52 కోట్లు లభించాయి.
ఇదీ చదవండి:ఐఫోన్ కొనాలనుకునే వారికి అమెజాన్ అదిరే ఆఫర్