డబ్బు తర్వాత మన దేశంలో అందరూ ఎక్కువగా మక్కువ చూపేది బంగారం పైనే... ఇంకా చెప్పాలంటే డబ్బుని బంగారంగా మార్చుకుని దాచుకోవడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. అందుకే మన దేశంలో పసిడి దుకాణాలు పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టే వ్యాపారస్తులు.. డిస్కౌంట్ల ప్రకటనలు ఇస్తూ... మా బంగారం మంచిదని, మేమిచ్చే అన్ని నగలపై హాల్ మార్క్ ఉందంటూ ఊదరగొట్టేస్తారు. అసలు మంచి బంగారం అంటే ఏంటి? అది మంచిదో కాదో ఎలా తెలుసుకోవాలి? హాల్ మార్కింగ్ ఏ ప్రాతిపదికన వేస్తారు... ఇలాంటి అంశాల మీద ప్రాథమిక అవగాహన లేకుండా బంగారం కొంటే ఇక అంతే సంగతులు.
బంగారం స్వచ్ఛతను ఎలా నిర్ధారిస్తారు?
హాల్‌మార్క్ సెంటర్లో మొదట వ్యాపారులు తెచ్చిన బంగారు ఆభరణంలోని చిన్న ముక్కను వేరు చేస్తారు. తర్వాత దాన్ని మెల్టింగ్ విధానంలో 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసి.. వివిధ పద్ధతుల్లో బంగారంలోని ఇతర ఖనిజాలను వేరుచేస్తారు. దాన్నుంచి స్వచ్ఛమైన బంగారాన్ని తీసి పరీక్షిస్తారు. ఆ తర్వాత ఆభరణాన్ని కంప్యూటర్ ద్వారా పరీక్షించినప్పుడు బంగారం యొక్క స్వచ్ఛత దానిలో వాడబడిన ఖనిజాల శాతం తెలియజేస్తూ... ఒక పట్టిక వస్తుంది. అందులో బంగారం శాతం 91.6 వచ్చినట్లయితే అది 22 క్యారెట్ల బంగారంగా నిర్ధారిస్తారు. ఈ రెండు విధానాలలో బంగారం స్వచ్ఛతను బేరీజు వేసుకున్న తర్వాత ఆన్లైన్లో షాపు యజమాని పేరు, తదితర వివరాలు నమోదు చేసుకొని లేజర్ మిషన్ ద్వారా ఆ బంగారు ఆభరణంపై కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన గుర్తును హాల్ మార్క్‌గా వేస్తారు. బంగారం శాతం 91.6 కన్నా తక్కువ వస్తే హాల్ మార్కింగ్ వేయరు. దీనివల్ల బంగారం కొన్న ప్రతి ఒక్క వినియోగదారుడు తమ బంగారం యొక్క స్వచ్ఛతను తెలుసుకునే వీలు ఉంటుంది.
హాల్ మార్క్ సెంటర్లో సిల్వర్ ఎంత కలిసింది, కాపర్, జింక్ లాంటివి ఎంత కలిసినయో మేము టెస్ట్ చేసి చెప్తం. అలాగే రిపోర్ట్ ఇచ్చి హాల్ మార్క్ వేస్తం. ఇప్పుడు కొత్త సిస్టం వచ్చింది. అంటే హెచ్‌యూఐడీ. ఆన్లైన్. సాంప్లింగ్ తీసుకొని అందులో ఏది ఎంత పర్సెంటేజ్లో ఉందో చూస్తాం. 916 ఉంటే దాని మీద గవర్నమెంట్ అలాట్ చేసిన హెచ్‌యూఐడీ 6 డిజిట్స్ నంబర్ వేస్తాం. అది ఎక్కడు చూసినా ఎవరు వేసిర్రు.. అందులో స్వచ్ఛత ఎంతుందనదే మనకు తెలిసిపోతుందన్నమాట.
- పద్మగౌడ్, క్వాలిటీ మేనేజర్
మంచి బంగారం అంటే ఏంటి.. ఎలా ఉంటుంది?
బంగారాన్ని క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం అంటే పూర్తి స్వచ్ఛమైనదని అర్థం. కానీ ఇది చాలా మెత్తగా ఉంటుంది. అందుకే 24 క్యారెట్ బంగారాన్ని ఆభరణాలకు ఉపయోగించరు. 22 క్యారెట్ల బంగారానే వాడుతుంటారు. 22 క్యారెట్ బంగారంలో... 91.6 శాతం బంగారం.. జింక్, కాపర్, వెండి వంటి ఖనిజాలుంటాయి. బంగారంలో ఇతర ఖనిజాలు వాడటం వల్ల అవి మరింత దృఢంగా, మన్నికగా ఉంటాయి. బంగారం శాతాన్ని బట్టి బంగారు ఆభరణాల రంగు ఆధారపడి ఉంటుంది. హాల్ మార్కింగ్ లేకుండా విక్రయించే బంగారంలో 18 క్యారెట్లకు మించి బంగారం ఉండదని అంచనా. దీంతో ఈ తరహా ఆభరణాలలో వర్తకులకు ఎక్కువగా లాభం ఉంటుంది.
హాల్ మార్కింగ్ ఎవరు వేస్తారు?