అంతర్జాలంలో వినియోగదారుల డేటా చోరీ రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా దాదాపు 267 మిలియన్ల ఫేస్బుక్ వినియోగదారుల డేటాను దొంగిలించారు సైబర్ నేరగాళ్లు. వారికి సంబంధించిన ఈమెయిల్ చిరునామాలు, పేర్లు, ఫేస్బుక్ ఐడీఎస్, పుట్టిన తేదీలు, ఫోన్ నంబర్లు తస్కరించారు. ఈ సమాచారాన్ని కేవలం రూ.41,500కు విక్రయించారు.
సైబర్ రిస్క్ అసెస్మెంట్ ప్లాట్‌ఫామ్ సైబుల్ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ 267 మిలియన్ల వినియోగదారుల పాస్‌వర్డ్‌లను బహిర్గతం చేయలేదని తెలిపింది.
" ఫేస్బుక్ వినియోగదారుల డేటా ఎలా లీక్ అయిందో మాకు తెలీదు. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్(ఏపీఐ) ద్వారా లీక్ చేసుండవచ్చు."
-- సైబుల్
గతేడాది డిసెంబరులో 267 మిలియన్లకు పైగా వినియోగదారుల పేర్లు, ఫోన్ నంబర్లతో కూడిన డేటాబేస్ ఆన్లైన్లో బహిర్గతమైనట్లు పలు వార్తలు వచ్చాయి. ఆన్లైన్ హ్యాకర్ ఫోరమ్‌లో డౌన్లోడ్ చేసేందుకే డేటాబేస్ అందులో ఉంచారు.
" ఈ సమస్యను మేం పరిశీలిస్తున్నాం. గత కొన్నేళ్లుగా వినియోగదారుల సమాచారాన్ని మరింత భద్రంగా ఉంచేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. "
-- ఫేస్బుక్
మరింత గోప్యత అవసరం
ఫేస్బుక్ ప్రొఫైల్‌లలో వినియోగదారుల సమాచారాన్ని మరింత గోప్యంగా ఉంచాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. సెట్టింగ్‌లను మరింత కఠినతరం చేయాలని, ఈమెయిల్, టెక్స్ట్ మెసేజ్‌ల విషయంలో జాగ్రత్త పాటించాలని చెబుతున్నారు.
గతంలో ఎన్నో
గతంలో యూకేకు చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ ఎనలిటికా 87 మిలియన్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించింది. ఇందుకు అప్పట్లో ఫేస్బుక్ సంస్థకు ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్‌టీసీ) 5 బిలియన్ల డాలర్ల జరిమానా విధించింది.
పలు యాప్‌లు, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల నిర్వహణ, వీడియో స్ట్రీమింగ్ యాప్‌లు, బృందాల ద్వారా వక్తుల పేర్లు, ప్రొఫైల్ ఫొటోలు, వ్యక్తిగత సమాచారం దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉందని ఫేస్బుక్ గుర్తించింది.
ఇవి కూడా...
ఫేస్బుక్ మాత్రమే కాకుండా ఓకేసారి ఎక్కువ సంఖ్యలో వీడియో కాల్లు మాట్లాడే అవకాశాన్ని కల్పించిన జూమ్ ద్వారా కూడా సుమారు 5 లక్షల మందికి పైగా డేటాను హ్యాక్ చేసినట్లు తెలిపింది సైబుల్. ఈ జూమ్ యాప్ ద్వారా ఎక్కువగా కంపెనీలకు చెందిన వ్యక్తులు సమావేశమవుతుంటారు. జూమ్ నుంచి హ్యాక్ చేసిన సమాచారాన్ని 5 వేల డాలర్ల నుంచి 30 వేల డాలర్ల మధ్య విక్రయిస్తున్నారని తెలిపిందీ సంస్థ.
ఇదీ చదవండి:లాక్‌డౌన్‌లో రోజుకు 4 గంటలు ఆన్‌లైలోనే!