చైనాలో విజృంభించిన కరోనా వైరస్ ప్రపంచంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రాల్లో ఒకటైన హాంకాంగ్‌కూ వ్యాపించింది. ఈ వైరస్ కారణంగా అక్కడ నెలరోజుల అత్యయిక స్థితి విధించారు. పాఠశాలలు, కళాశాలల మూసివేతతో పాటు హాంకాంగ్‌లో వ్యాపారాలు నెమ్మదించాయి. ఈ ప్రభావం మన దేశంలోని సూరత్ వజ్రాల పరిశ్రమపై పడింది.
సూరత్‌కు హాంకాంగ్ ప్రధాన వ్యాపార కేంద్రం. ఏటా సూరత్ నుంచి దాదాపు 45 వేల కోట్ల విలువైన పాలిష్‌డ్ వజ్రాలు హాంకాంగ్‌కు ఎగుమతి అవుతుంటాయి. సూరత్ నుంచి ఎగుమతయ్యే మొత్తం వజ్రాల విలువలో ఇది 37 శాతానికి సమానం. చైనాకు మరో 4 శాతం ఎగుమతి అవుతాయి. ఇలా 41 శాతం వజ్రాల ఎగుమతులపై కరోనా ప్రభావం పడింది.
భారీ నష్టం..!
హాంకాంగ్‌లో ఎమర్జెన్సీ కారణంగా సూరత్ వజ్రాల వ్యాపారులు తిరుగుముఖం పట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సూరత్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని 'జెమ్స్ అండ్ జువెల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్' (జేజేఈపీసీ) తెలిపింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో దాదాపు 8 వేలకోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది.