తెలంగాణ

telangana

ETV Bharat / business

లాటరీలపై 28శాతం పన్ను విధింపు: జీఎస్టీ మండలి

జీఎస్టీ 38వ సమావేశం నేడు జరిగింది. లాటరీలపై 28 శాతం పన్ను విధించడం సహా జీఎస్టీఆర్-1 దాఖలు చేయనందుకు విధించే పెనాల్టీని మినహాయిస్తున్నట్లు మండలి భేటీలో నిర్ణయించారు. లాటరీలపై పన్ను విధించే విషయంలో జీఎస్టీ మండలిలో తొలిసారి ఓటింగ్ జరగడం విశేషం.

GST Council fixes 28 pc uniform tax rate for lottery
జీఎస్టీ మండలి 38వ భేటీ

By

Published : Dec 18, 2019, 9:38 PM IST

ఇక నుంచి ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలకు చెందిన లాటరీలపై సమానంగా 28 శాతం పన్ను విధిస్తూ.. జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. నూతన పన్ను విధానం.. 2020 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తుందని.. జీఎస్టీ 38వ సమావేశం అనంతరం రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషన్ పాండే వెల్లడించారు.

నేసిన, నేయని(వూవెన్​, నాన్​ వూవెన్​) సంచులపై జీఎస్టీ రేటును 18 శాతానికి పెంచినట్టు తెలిపారు భూషన్​ పాండే. దీనితో పాటు పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం ఇచ్చే దీర్ఘకాల లీజులపై పలు మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. జీఎస్టీఆర్-1 దాఖలు చేయనందుకు విధించే పెనాల్టీని సైతం తగ్గిస్తూ మండలి నిర్ణయం తీసుకున్నట్లు పాండే తెలిపారు.

తొలిసారి ఓటింగ్

లాటరీలపై విధించే పన్ను విషయంలో రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో జీఎస్టీ మండలిలో ఓటింగ్ నిర్వహించారు. ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు జీఎస్టీ మండలి 37సార్లు సమావేశం కాగా అన్ని సార్లు నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకోవడం గమనార్హం.

28 శాతం పన్ను విధించాలని నిర్వహించిన ఓటింగ్​లో 21 రాష్ట్రాలు అనుకూలంగా 7 రాష్ట్రాలు వ్యతిరేకంగా ఓటేశాయి. ప్రస్తుతం లాటరీలపై ద్వంద్వ పన్ను రేటు ఉంది. ఇప్పటివరకు లాటరీ సంస్థలు... రాష్ట్రాల్లో విక్రయించే లాటరీలపై 12శాతం, ఇతర రాష్ట్రాల్లో విక్రయించే లాటరీలపై 28శాతం జీఎస్టీ విధిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details