వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నేడు తొలిసారి సమావేశం కానుంది. జీఎస్టీ వసూళ్లు భారీ స్థాయిలో తగ్గుతున్న నేపథ్యంలో పన్ను ఎగవేతలను గుర్తించడం సహా వసూళ్లు పెంచే సూచనలు ఇచ్చేందుకు 12 మంది సభ్యులతో కూడిన ఈ ప్యానెల్‌ను ప్రభుత్వం గతవారం ఏర్పాటు చేసింది.
వసూళ్లు పెంచడమే లక్ష్యంగా జీఎస్టీ కమిటీ భేటీ
జీఎస్టీ వసూళ్లను పెంచేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసిన జీఎస్టీ ఉన్నత స్థాయి కమిటీ నేడు తొలిసారి భేటీ కానుంది.
వృద్ధి మందగమనాన్ని ప్రతిబింబిస్తూ..సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు దాదాపు 19 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. రూ.91,916 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలకు కమిటీని నియమించింది. 2017 జులై 1న జీఎస్టీ అమలైన తర్వాత సమగ్ర సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి.
వసూళ్ల పెంపు సహా పలు అంశాలపై ఈ కమిటీ సమీక్షలు నిర్వహించి.. 15 రోజుల తర్వాత ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది. 12 సభ్యుల కమిటీలో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్, పంజాబ్ రాష్ట్రాల జీఎస్టీ కమిషనర్లు, కేంద్ర ప్రభుత్వ అధికారులైన జీఎస్టీ ప్రధాన కమిషనర్, సంయుక్త కార్యదర్శి (ఆదాయం) సహా ముఖ్య అధికారులు ఉన్నారు.