GST Collection in January 2022: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 2022 జనవరిలోనూ 1.30 లక్షల కోట్ల మార్క్ దాటాయి. జనవరిలో మొత్తం 1.38 లక్షల కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. 2022, జనవరి 30 నాటికి జీఎస్టీఆర్-3బీ రిటర్న్లు దాఖలైంది 1.05 కోట్లుగా పేర్కొంది. దీంతో వరుసగా నాలుగో నెలలోనూ 1.30 లక్షల కోట్ల వసూళ్లు దాటినట్లయింది.
జీఎస్టీ ద్వారా గత నెల మొత్తం రూ.1,38,394 కోట్ల ఆదాయం గడించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ప్రకటించింది. 2021 జనవరితో పోల్చితే ఈ మొత్తం 15 శాతం ఎక్కువని పేర్కొంది.
వసూళ్లు ఇలా..
- కేంద్ర జీఎస్టీ: రూ.24,674 కోట్లు
- రాష్ట్రాల జీఎస్టీ: రూ.32,016 కోట్లు
- సమీకృత జీఎస్టీ: రూ.72,030 కోట్లు
- సెస్: రూ.9,674 కోట్లు