కొవిడ్-19 రెండో దశ విజృంభణ.. ప్రజలకు ప్రాణాంతకంగా మారింది. ఎంతోమంది ఆసుపత్రుల పాలవుతున్నారు. కొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. ఆసుపత్రుల్లో రూ.లక్షల బిల్లులు కట్టలేక జేబులు గుల్లవుతున్నాయి. దీనికి ఆరోగ్య బీమా పాలసీ ఉండటమే కొంత పరిష్కారంగా కనిపిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో చాలామంది ఈ పాలసీలను కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా ఇప్పటికే బీమా కంపెనీలు ప్రీమియాన్ని పెంచేశాయి. ఫలితంగా పాలసీల కొనుగోలు పెను భారంగా మారింది. ఒక పక్క ప్రీమియం మొత్తం చెల్లించలేక ఇబ్బందులు పడుతుంటే.. దానిపై 18శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని చూసి పాలసీదారుల గుండెలు గుభేలుమంటున్నాయి.
కుటుంబంలో ఒక వ్యక్తికి కరోనా సోకి ఆసుపత్రిలో చేరితే.. అప్పటి వరకూ సంపాదించిన మొత్తం అంతా ఖాళీ అవుతోంది. రూ.10లక్షలకు మించి బిల్లులు అవుతున్న సంఘటనలూ ఎన్నో చూస్తున్నాం. సంపాదించే కుటుంబ పెద్ద ప్రాణాలను ఈ మహమ్మారి హరించి.. ఆ కుటుంబానికి ఆర్థిక అండనూ దూరం చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, గత ఏడాది కాలంగా అటు జీవిత బీమాలో టర్మ్ పాలసీలు.. ఇటు ఆరోగ్య బీమా పాలసీలకూ గిరాకీ బాగా పెరిగింది. దీంతోపాటు కొవిడ్ రక్షణ కోసం ప్రత్యేక పాలసీలకూ ఆదరణ బాగానే లభించింది. మరోవైపు కొవిడ్-19 క్లెయింలు పెరుగుతున్నాయనే కారణంగా బీమా సంస్థలు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి.
15-30 శాతం వరకూ..
ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్న వారికి నిబంధనల మేరకు కొవిడ్-19 చికిత్సకు అనుమతి ఉంది. ఆసుపత్రులు ఇచ్చే బిల్లులో ముందే పేర్కొన్న మినహాయింపులకు తప్ప.. మిగతా మొత్తాన్ని చెల్లిస్తున్నాయి. తొలి దశలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి బీమా సంస్థలు ముందే జాగ్రత్తపడ్డాయి. గత ఏడాది అక్టోబరు నుంచే ప్రీమియాన్ని పెంచడం ప్రారంభించాయి. ఉదాహరణకు ఏప్రిల్ 2020లో 40 ఏళ్ల వ్యక్తి రూ.3లక్షల ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే.. ప్రీమియం రూ.4,727గా ఉంది. అదే వ్యక్తి 2021లో పాలసీని పునరుద్ధరణ చేసుకుంటే.. రూ.5,956 చెల్లించాల్సి వస్తోంది. ఒక వ్యక్తికే దాదాపు రూ.1,200 వరకూ అదనపు భారం పడుతుంది. కుటుంబంలో నలుగురు వ్యక్తులుంటే.. ఈ భారం దాదాపు రూ.5,000 వరకూ ఉంటోంది. కొత్త బీమా పాలసీలు తీసుకోవాలనుకున్న వారికి ఇప్పుడు కనీసం రూ.5లక్షలకు తప్ప పాలసీ ఇస్తున్న సంస్థలు చాలా తక్కువే. సంస్థ, పాలసీ రకాన్ని బట్టి 22 ఏళ్ల వ్యక్తికి రూ.5లక్షల వ్యక్తిగత బీమా పాలసీ తీసుకోవాలంటే.. కనీసం రూ.6,000 నుంచి రూ.9,000 వరకూ అవుతోంది.