కావ్యా చెరియన్.. పోయిన ఏడాది తన బామ్మ ఇంటికి వెళ్లింది. అక్కడి వంట పాత్రలు భిన్నంగా ఉండటం గమనించింది. ఆమె చేతి వంట కూడా చాలా రుచిగా అనిపించింది. ముఖ్యంగా ఆమె చేసిన రసం తయారీని నేర్చుకుని ఇంటికొచ్చాక ప్రయత్నించింది. ఎన్నిసార్లు చేసినా ఆ రుచి మాత్రం రాలేదు. బామ్మకు సర్జరీ అయితే మళ్లీ వెళ్లింది. ‘బామ్మకి కంటికి ఆపరేషన్ అవ్వడంతో వంట చేయడం కుదిరేది కాదు. తను బయట కూర్చొని సూచనలిస్తే నేను ఆ ప్రకారం చేసేదాన్ని. సంప్రదాయ వంటపాత్రల్లో వండటం భలే అనుభూతినిచ్చింది. కొన్ని పాత్రలను తరాలుగా ఉపయోగిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయా’ అంటుందీ కేరళ అమ్మాయి.
‘గ్రీన్ హేర్‌లూమ్’
కొన్ని నచ్చినవాటిని తన ఇంటికోసం కొనుక్కోవాలనుకుంది. ఎన్నో పెద్ద సూపర్ మార్కెట్లకు వెళ్లినా దొరకలేదు. ఈ సంప్రదాయ సంపద కనుమరుగవుతోందని ఆమెకు అర్థమైంది. కావ్య.. ముంబయిలో ఓ ప్రముఖ సంస్థలో యాక్చూరియల్ అనలిస్ట్‌గా పనిచేసేది. ఒకేచోట కూర్చుని పనిచేయడం ఆమెకు నచ్చలేదు. దీంతో ఉద్యోగాన్ని వదిలేసింది. మనసుకి హాయినీ, సంతృప్తినీ ఇచ్చేదాన్ని కెరియర్‌గా ఎంచుకోవాలనుకుంది. ‘ఈ సంప్రదాయ వంట పాత్రలనే ఇప్పటి తరాలకూ పరిచయం చేస్తే?’ అనే ఆలోచన వచ్చింది. పైగా ఇవి పర్యావరణానికి హాని కలిగించవు కూడా. గత ఏడాది ఆగస్టులో ‘గ్రీన్ హేర్‌లూమ్’ పేరిట నిర్వహణీయ, ఆర్గానిక్ కుక్‌వేర్ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభించింది. ఆమె అమ్మేవన్నీ కంచు, మట్టి, ఇనుము, చెక్క, రాళ్లతో తయారైనవే. వీటికోసం దేశవ్యాప్తంగా మణిపుర్, మధురై, పాలక్కాడ్, సేలం, మన్నార్, మేఘాలయ మొదలైన ప్రాంతాల్లో వాటిని తయారుచేసే చేతివృత్తుల వారిని సంప్రదించి, ఒప్పందాలు చేసుకుంది.