జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్ ఆ సంస్థ బోర్డు నుంచి వైదొలిగారు. రెండు సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కారణంగా సంస్థ వ్యవహారాల నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. 25 ఏళ్లుగా విమానయాన రంగంలో కొనసాగుతున్నారు నరేశ్ గోయల్.
విమానయానానికి ఎదురుదెబ్బ...
నరేశ్ గోయల్ సంస్థ బోర్డును వీడడం విమానయాన రంగానికి పెద్ద ఎదురుదెబ్బ అని స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ అన్నారు. ఈ పరిణామం తర్వాతైనా విధాన నిర్ణేతలు మేలుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
"నేడు భారత విమానయాన రంగానికి చీకటి రోజు. అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌లైన్స్‌ను స్థాపించి నరేశ్, అనితా గోయల్ ద్వయం దేశం గర్వపడేలా చేశారు"
-అజయ్‌సింగ్, ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్, స్పైస్ జెట్
గోయల్ వైదొలిగిన వేళ నిధుల రాక
ఆర్థిక పరిస్థితి దెబ్బతిని 80 విమానాలను తిప్పడం మానేసింది జెట్ ఎయిర్వేస్. దేశీయ రుణదాతల నుంచి అప్పులను స్వీకరించేందుకు ఎస్బీఐ తయారుచేసిన ప్రణాళికను జెట్ ఎయిర్వేస్ బోర్డు సభ్యులు అంగీకరించారు. దీని ద్వారా 51 శాతం కంపెనీ షేర్లను రూ.1500 కోట్ల రూపాయలకు అమ్మనున్నారు. ఈ ధనాన్ని 11.4 కోట్ల ఈక్విటీ షేర్ల అమ్మకం ద్వారా సమకూరుస్తారు. ప్రస్తుతం రూ. 8000 వేల కోట్ల రుణభారంతో ఉంది జెట్ ఎయిర్వేస్పై.