Cryptocurrency in India: వస్తు, సేవల పన్ను (GST) చట్టం ప్రకారం.. క్రిప్టోకరెన్సీని వస్తువులు లేదా సేవలుగా వర్గీకరించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తద్వారా ఈ లావాదేవీల మొత్తం విలువపై పన్ను విధించేందుకు అవకాశం ఏర్పడనుంది. ప్రస్తుతం క్రిప్టో ఎక్స్ఛేంజీలు అందిస్తున్న సేవలను ఆర్థిక సేవలుగా పరిగణించి వాటిపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు.
28 శాతం జీఎస్టీ శ్లాబు పరిధిలో ఉన్న లాటరీ, క్యాసినో, బెట్టింగ్, గుర్రపు పందెం, గ్యాంబ్లింగ్‌ల తరహాలోనే క్రిప్టోలనూ పరిగణించాలని జీఎస్టీ అధికారులు భావిస్తున్నారు. "క్రిప్టోకరెన్సీలపై జీఎస్టీ విధింపు విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం లావాదేవీ విలువపై పన్ను విధించాలా? అనే విషయంపైనా ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే క్రిప్టోలను వస్తువు లేదా సేవలుగా వర్గీకరించే విషయంపై కసరత్తు జరుగుతోంది. అసలు దీన్ని 'యాక్షనబుల్ క్లెయిమ్'గా పరిగణించవచ్చా? లేదా? కూడా చూడాల్సి ఉంది" అని ఓ జీఎస్టీ అధికారి తెలిపారు. స్థిరాస్తి తనఖా ద్వారా తీసుకున్న రుణం కాకుండా ఇతర ఏ రుణాల కోసమైనా రుణదాత దావా వేయగలిగితే దాన్ని 'యాక్షనబుల్ క్లెయిమ్' అంటారు. క్రిప్టోల నియంత్రణపై ఇప్పటి వరకు ఎలాంటి చట్టం లేకపోవడం వల్ల అసలు దీన్ని యాక్షనబుల్ క్లెయింగా పరిగణించాలా?లేదా? అనే దానిపై కూడా సందేహాలు ఉన్నాయి.