కరోనా కారణంగా దిగాలుపడిన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించే విధంగా ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ప్రస్తుతం వివిధ రంగాల వాస్తవ పరిస్థితిని పర్యవేక్షించి, ఏఏ రంగానికి ఎలాంటి సహాయం అవసరమో మదింపు వేస్తున్నట్లు చెప్పారు.
"పరిశ్రమ వర్గాలు, వర్తక సంఘాలు, వివిధ మంత్రిత్వ శాఖల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నాం. వీటితో పాటు ఆర్థిక వ్యవస్థ తీరును పరిశీలించి సరైన చర్యలతో ముందుకొస్తాం."
-అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక శాఖ కార్యదర్శి
ఉద్దీపన ప్యాకేజీ ఎప్పుడు ప్రకటిస్తారనే విషయాన్ని పాండే వెల్లడించలేదు. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై విస్తృత చర్చలు జరుపుతోందని స్పష్టం చేశారు.
మరోవైపు.. లాక్డౌన్ వల్ల ఇబ్బందిపడ్డ వారికి ఎన్నో విధాలుగా ప్రభుత్వం సహాయం చేసిందని వివరించారు.
"కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాతి నుంచి ప్రతి రంగం పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నాం. వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రంగా దెబ్బతిన్న ప్రజలకు అవసరమైన సాయం చేశాం. మహిళలకు జన్‌ధన్ ఖాతాల ద్వారా నగదు బదిలీ చేశాం. పీఎం కిసాన్ యోజన కింద సాయాన్ని త్వరగా అందించాం. ఉద్యోగులు, ఎంఎస్ఎంఈలు, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకున్నాం."
-అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక శాఖ కార్యదర్శి
ప్రతికూలం నుంచి బయటకు...
ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగుపడిందని అన్నారు పాండే. కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని తెలిపారు. సుస్థిరమైన అభివృద్ధి పథంవైపు ఆర్థిక వ్యవస్థ అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో విడుదలైన గణాంకాలు.. ఆర్థిక వ్యవస్థ కరోనాకు పూర్వ దశకు చేరుకున్నాయని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. మరో ఐదు నెలలు ఇలాగే కొనసాగితే.. ప్రతికూలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ వృద్ధి సున్నా స్థాయికి మెరుగవుతుందని అంచనా వేశారు పాండే.
ఇదీ చదవండి-భారత్‌కు మరో ఉద్దీపన ప్యాకేజీ అవసరం:ఐఎంఎఫ్