బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో వజ్రాల వ్యాపారి, 49 ఏళ్ల నీరవ్ దీపక్ మోదీ(ఎన్డీఎం)కి లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు పంపిచకూడదంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని గురువారం నైరుతి లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది.
"పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించడానికి కుట్ర పన్నారన్న వ్యవహారంలో ఎన్డీఎంకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నట్లు నమ్ముతున్నాం. ఆయన భారత్‌కు వెళ్లి అక్కడి కోర్టులకు సమాధానం చెప్పాల్సి ఉంది."
- జడ్జి శామ్యూల్ గూజీ, వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు
మోసం, నగదు అక్రమ చలామణీ జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని జడ్జి తెలిపారు. జైలులో ఉండటం వల్ల ఆయన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నప్పటికీ, భారత్‌కు పంపించడానికి ఇది అడ్డంకి కాబోదని పేర్కొన్నారు. ఆయనను ముంబయి అక్బర్ రోడ్‌లోని సెంట్రల్ జైలులో ఉన్న 12వ నెంబర్ బ్యారెజ్‌కు పంపిస్తే ఆరోగ్యం కుదుటపడవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందులో రాజకీయ జోక్యం ఉందంటూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కేండేయ కట్జూ చేసిన వ్యాఖ్యాలను తిరస్కరించారు. ఈ తీర్పు కాపీని హోం మంత్రి ప్రీతి పటేల్‌కు పంపించనున్నారు.