అభివృద్ధి చెందుతున్న రంగాలను ప్రోత్సహించడం, నియంత్రణ అడ్డంకులను తగ్గించడం, భారత్‌ను ఉత్పాదక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో ఓ కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.
పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ).. ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని సిద్ధం చేసి ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపింది. తాజాగా ఈ విధానానికి సంబంధించి మరికొన్ని కొత్త సూచనలు చేసింది. వీటిని కార్యనిర్వాహక బృందం సమీక్షించి, డీపీఐఐటీకి సమర్పిస్తుందని ఓ అధికారి వివరించారు.
కార్యనిర్వాహక బృందం సభ్యులు
ఈ వర్కింగ్ గ్రూపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో సహా పారిశ్రామిక సంస్థలకు చెందిన సభ్యులు ఉంటారు.
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా...
దేశంలో 1956లో మొదటి పారిశ్రామిక విధానం తీసుకువచ్చారు. 1991లో రెండో పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టారు. తాజాగా రూపొందించినది మూడో పారిశ్రామిక విధానం. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశాన్ని ఉత్పాదక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రతిపాదించారు.
2017 మేలో కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించే ప్రక్రియను డీపీఐఐటీ ప్రారంభించింది. ఈ కొత్త విధానం ద్వారా జాతీయ తయారీ విధానం (ఎన్‌ఎమ్‌పీ)ను ప్రోత్సహించాలని నిర్ణయించింది.
ఈ విధానం ద్వారా ముఖ్యంగా ఆరు రంగాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తారు. వీటిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, తయారీ రంగాలు ఉన్నాయి. సాంకేతికలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయలు, పెట్టుబడి, వాణిజ్యం, ఆర్థిక విధానం, నైపుణ్యాలు, ఉపాధి కల్పన సామర్థ్యాలు పెంపొందించడం... ఈ నూతన విధానం లక్ష్యాలు. ఈ విధానం ద్వారా... రాబోయే రెండు దశాబ్దాల్లో ఉద్యోగాల సృష్టి, విదేశీ సాంకేతిక బదిలీ ప్రోత్సాహం, ఏటా 100 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదీ చూడండి:పండుగల వేళ రుణమా..? ఇవి తెలుసుకోండి...
.