దేశంలో పర్యటక రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల ఆల్ ఇండియా పర్యటక అనుమతులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లో మంజూరు చేసే కొత్త పథకాన్ని తేనుంది.
పర్యటక వాహనాల యజమానులు ఆల్ ఇండియా పర్యటన అనుమతి కోసం ఆన్‌లైన్‌లో సంబంధిత పత్రాలు, రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లో అనుమతి లభిస్తుంది. అఖిల భారత పర్యాటక వాహనాల ప్రాధికార, అనుమతి పేరుతో కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ రూపొందించిన ఈ నిబంధనలు 2021 ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధనలు వచ్చినా.. అప్పటికే ఉన్న విధానం నిర్ణీత కాలపరిమితి ముగిసే వరకు అమలులో ఉంటుంది.