ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PM Jan-Dhan Yojana) పథకం ద్వారా బ్యాంక్ ఖాతాల సంఖ్య 43 కోట్లు దాటింది. ఈ ఖాతాలన్నింటిలో కలిపి ఇప్పటి వరకు రూ.1.46 లక్షల కోట్లు డిపాజిట్ (deposits in Jan-Dhan accounts) అయినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.
ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశంతో 2014 ఆగస్టు 28న ఈ పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. సరిగ్గా ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా పథకం పనితీరును వివరిస్తూ ఈ గణాంకాలను విడుదల చేసింది.
మహిళల ఖాతాలే అత్యధికం..
ఈ నెల 18 నాటికి మొత్తం 43.04 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉండగా.. అందులో 55.47 శాతం (23.70 కోట్లు) మహిళలకు చెందివే కావడం విశేషం. మొత్తం ఖాతాల్లో 66.69 శాతం (23.70 కోట్లు) గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలకు చెందిన వారివే.
అయితే 43.04 జన్ ధన్ బ్యాంక్ ఖాతాల్లో.. 36.86 ఖాతాలు (85.6 శాతం) క్రియాశీలంగా ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. యాక్టివ్గా ఉన్న ఒక్కో ఖాతాలో సగటు డిపాజిట్ రూ.3,398గా ఉన్నట్లు వెల్లడించింది.