ప్రైవేటీకరణతో బ్యాంకింగ్ రంగ సామర్థ్యం, వృత్తి నిబద్ధత మరింత మెరుగవుతుందని బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరు మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్రైవేటీకరణ ప్రణాళికకు పూర్తి మద్దతు ఇస్తున్నారు.
'ప్రైవేటీకరణ వల్ల యాజమాన్యంలో మార్పు మాత్రమే కాదు.. బ్యాంకింగ్ రంగంలో ఉత్పాదకత మెరుగవుతుంది. యాజమాన్యం మారితే (ప్రైవేటుకు) ప్రభుత్వ నిర్ణయాధికారం తగ్గుతుంది. దీనితో బ్యాంకింగ్ రంగంలో మరింత స్వేచ్ఛగా వ్యవహరించే వీలుంటుంది.' అని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ మోహన్ టంక్సాలె అన్నారు. ఏటీఎంల నిర్వహణ కంపెనీ ఈపీఎస్ ఇండియా ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 'ఈటీవీ భారత్' అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరణ ఇచ్చారాయన.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వృద్ధే ఉదాహరణ..
ప్రైవేటీకరణ వల్ల ఉపయోగాలను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వృద్ధిని ఉదహరించి వివరిచారు మోహన్ టంక్సాలె. బ్యాంక్ స్థాపించిన 30 ఏళ్ల లోపే ఎస్బీఐ తర్వాత దేశంలో అతిపెద్ద బ్యాంక్‌గా(వ్యాపార పరిమాణం పరంగా) అవతరించిందని తెలిపారు. ప్రైవేటు బ్యాంకుల్లో అయితే అగ్రస్థానంలో ఉన్నట్లు వివరించారు. అగ్రస్థానంలో ఉన్న ఎస్బీఐకి 100 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్నట్లు తెలిపారు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకూ 109 ఏళ్ల చరిత్ర ఉందని.. అయినా వ్యాపార పరిమాణం, బ్యాంక్ శాఖలు, ఏటీఎంల పరంగా ప్రైవేటు బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐల కన్నా వెనకబడి ఉన్నట్లు తెలిపారు.
ఉన్నత స్థాయిలో మార్పు ఉండదు కాబట్టే..
ప్రైవేటు సంస్థల్లో ఎక్కువ కాలం ఒక్కరే ఉన్నత స్థాయిలో కొనసాగుతారని.. బ్యాంకుల వృద్ధికి ఇదీ ఒక కీలక కారణమని ఆయన పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓగా ఆదిత్య పూరి రెండు దశాబ్దాలకుపైగా కొనసాగారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్న మాజీ బ్యాంకర్లలో విజయా బ్యాంక్ మాజీ సీఎండీ ఉపేంద్ర కామత్ కూడా ముందు వరుసలో ఉన్నారు.
నష్టాలను నమోదు చేస్తున్న ప్రభుత్వ బ్యాంక్లు పెద్ద సఖ్యలో ఉండటం వల్ల.. ప్రతి సంవత్సరం వేల కోట్లలో ప్రజాధనం వృథా అవుతోందని ఉపేంద్ర కామత్ పేర్కొన్నారు.
రాజ్యసభకు కేంద్రం సమర్పించిన ఇటీవలి డేటా ప్రకారం.. 2019 జూలైలో దేశవ్యాప్తంగా 56 ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని.. వాటి నష్టాలు దాదాపు రూ.1.32 లక్షల కోట్లుగా ఉన్నట్లు తేలిందని వివరించారు.
నష్టాల్లో ఉన్న కంపెనీలను ప్రోత్సహించాలా లేదా వాటి నుంచి తప్పుకోవాలనా అనేది ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారినట్లు 'ఈటీవీ భారత్'తో చెప్పుకొచ్చారు ఉపేంద్ర కామత్.