దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో.. ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు టోకు, చిల్లర వ్యాపారుల ఉల్లి నిల్వలపై విధించిన ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. టోకు వ్యాపారులు 25 టన్నులు, చిల్లర వర్తకులు 5 టన్నులకు మించి ఉల్లి నిల్వ చేయకూడదని వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
గతంలో 50 టన్నులు
అంతకుముందు టోకు వర్తకులు 50, చిల్లర వ్యాపారులు 10 టన్నుల వరకు నిల్వ చేసుకునే అవకాశం ఉండగా... తాజాగా కేంద్రం ఆంక్షలతో వ్యాపారుల నిల్వలు సగానికి పడిపోనున్నాయి.
అయితే దిగుమతి చేసుకున్న ఉల్లికి మాత్రం ఈ నిల్వల పరిమితి వర్తించదు.
గత కొన్ని వారాలుగా దేశంలో ఉల్లి ధరలు సరికొత్త శిఖరాలకు చేరుతున్నాయి. మార్కెట్లో ఉల్లి సరఫరా పెంచడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నప్పటికీ... ధరలు మాత్రం కొండెక్కుతున్నాయి.