విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంకట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 69,000 పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవీ) ఛార్జింగ్ కియోస్కులను ఏర్పాటు చేసే యోచనలో ఉంది.
ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్.. ఛార్జర్లు దొరకవనే ప్రజలు విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయట్లేదన్నారు. అందుకే దేశంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్వహిస్తున్న అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఈవీ ఛార్జర్లను తప్పనిసరి చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు.
తొలుత కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వడోదర, భోపాల్ వంటి మహానగరాలు, హైవేలపై ఉన్న పెట్రోల్ బంకుల్లో ఈవీ ఛార్జర్లు ఏర్పాటు చేయాలని సూచించారు సింగ్. ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్న వేళ.. ప్రజలను విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలన్నారు.