తెలంగాణ

telangana

ETV Bharat / business

చైనా వస్తువుల దిగుమతులకు ప్రభుత్వ కళ్లెం..! - చైనా వస్తువుల దిగుమతులపై ప్రభుత్వం కళ్లెం!

అనవసరమైన వస్తువుల దిగుమతులను తగ్గించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. చైనా నుంచి దిగుమతి అవుతున్న 56 బిలియన్ డాలర్ల వస్తువులకు కళ్లెం వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బడ్జెట్​ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Govt-may-increase-import-duties-on-more-than-50-items
చైనా వస్తువుల దిగుమతులకు ప్రభుత్వం కళ్లెం!

By

Published : Jan 27, 2020, 7:24 AM IST

Updated : Feb 28, 2020, 2:39 AM IST

దిగుమతుల పద్దుకు కళ్లెం వేయాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా చైనా నుంచి 56 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతి వస్తువులకు కళ్లెం వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఆర్థిక మంత్రి గురిలో ఉన్న వాటిల్లో మొబైల్‌ ఫోన్ల ఛార్జర్లు, పరిశ్రమల్లో వినియోగించే రసాయనాలు, దీపాలు, కలపతో చేసిన ఫర్నీచర్‌, క్యాండిల్స్‌, నగలు, చేతి తయారీ వస్తువులు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం కనుక వీటిపై దిగుమతి సుంకం పెంచితే ముఖ్యంగా మొబైల్‌ ఛార్జర్లను, దిగుమతి చేసుకొంటున్న ఫోన్ల తయారీదార్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతోపాటు ఐకియా వంటి సంస్థలపై ఈ నిర్ణయం ప్రభావం చూపించనుంది. వీటిపై దాదాపు 5 శాతం నుంచి 10 శాతం వరకు దిగుమతి సుంకం పెంచాలని ఒక ప్యానల్‌ ఇప్పటికే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

అనవసరమైన వస్తువుల దిగుమతులను తగ్గించడమే ఇక్కడ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇవన్నీ చైనా, ఆగ్నేయాసియా (ఆసియన్‌), ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. 2014 నుంచి చూస్తే ఇప్పటికే మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రక్షణ రంగంతో సహా వివిధ రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూనే.. వివిధ రకాల దిగుమతులను కట్టడి చేసేలా నిర్ణయాలు తీసుకొంది.

130 అనుకున్నారు కానీ...

ఇప్పుడు కూడా దాదాపు 130 రకాల వస్తువులను కట్టడి చేయాలని భావించినా.. ఆ తర్వాత వాటిని 50కు కుదించారు. గత ఏడాదే ప్రభుత్వం బంగారం, ఆటోమొబైల్‌ ఉత్పత్తులతో సహా దాదాపు 75 రకాల వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచింది. దీంతోపాటు దిగుమతుల నాణ్యతను బట్టి కూడా సుంకాలను విధించే అవకాశం ఉంది. భారత భద్రతా, ఆరోగ్య, వాతావరణ ప్రమాణాలను బట్టి వీటిని నిర్ణయిస్తారు. గత కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తున్న దిగుమతులు గతేడాది 8.90శాతం తగ్గాయి.. అదే సమయంలో ఎగుమతులు కూడా 2శాతం పతనం అయ్యాయి. ఫలితంగా వాణిజ్యలోటు 118 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది అంతకు ముందు సంవత్సరం 148 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కానీ, ప్రభుత్వం ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులను కట్టడి చేస్తే ఆ మిగిలే లోటును అమెరికాతో వాణిజ్యంతో భర్తీ చేసుకోవచ్చు. ఇప్పటికే భారత్‌ మరో 6 బిలియన్‌ డాలర్ల వరకు అదనంగా అమెరికా నుంచి దిగుమతులు పెంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. లేకపోతే అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంది.

Last Updated : Feb 28, 2020, 2:39 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details