విద్యుత్ వాహనాల కొనుగోళ్లను పెంచేందుకు తీసుకువచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్)-2 పథకం (FAME 2 subsidy) గడువును పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ప్రణాళికలు వస్తున్న వారికి ఇది ఓ శుభవార్త కానుంది. నిజానికి ఈ పథకం 2022 మార్చి 31తో ముగియాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం దీనిని 2024 మార్చి 31 వరకు పొడిగించే అవకాశముంది.
మరిన్ని ఈ-వాహనాలు..
గడువు పెంపుతో పాటు ఈసారి ఎలక్ట్రిక్ సైకిళ్లను కూడా ఈ పథకం పరిధిలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎలక్ట్రిక్ సైకిళ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాటి ధరలను వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
ఫేమ్-2 పథకం పరిధిలో ప్రస్తుతం విద్యుత్ కార్లు, ఆటోలు, కార్లు, బైక్‌లు (FAME 2 subsidy on electric scooter) సహా పలు రకాల గూడ్స్ వాహనాలు ఉన్నాయి. విద్యుత్ సైకిళ్లు దీని పరిధిలోకి తెస్తే.. వ్యక్తిగత, వాణిజ్య వాహనాలన్నీ ఈ పథకం పరిధిలోకి వచ్చినట్లవుతుంది.
ఇటీవలే రాయితీ పెంపు..
ఇటీవలి నెలల్లోనే.. ఫేమ్-2 రాయితీని (FAME 2 subsidy amount) కిలోవాట్‌కు రూ.10,000 నుంచి రూ.15,000 పెంచింది కేంద్రం. విద్యుత్ ద్విచక్రవాహనాల మొత్తం ధరలో ప్రస్తుతం 20 శాతం రాయితీ పరిమితి ఉండగా.. దాన్ని 40 శాతానికి సవరించింది. సబ్సీడీ పెంపు ద్వారా 2025 నాటికి 60 లక్షల అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశిస్తోంది.